అమరావతి: యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేయడానికి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్పష్టం చేశారు. ఈ రోజు (సోమవారం) ఏపీ సచివాలయంలో మంత్రి లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, మారుమూల ప్రాంతాల్లో ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందిగా ఉన్నట్లు బ్రాహ్మణులు పాదయాత్ర సమయంలో తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం, ధూప, దీప నైవేద్యానికి సాయం రూ. 10 వేలకు పెంచినట్లు చెప్పారు. ఈ చర్య వల్ల రాష్ట్రంలోని 5400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా, అందరి క్షేమం కోరే మంచి ప్రభుత్వం తమదని నారా లోకేష్(Nara Lokesh) వెల్లడించారు.
ప్రజా చైతన్యాన్ని కేంద్రీకరించిన యువగళం:
యువగళం పాదయాత్ర ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యాన్ని లక్ష్యంగా ఉంచుకొని ముందుకు సాగింది. నారా లోకేశ్(Nara Lokesh) 226 రోజులు 3,132 కిలోమీటర్లు నడిచారు. 11 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 232 మండలాలు/మునిసిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా ఈ యాత్ర కొనసాగింది.
జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల లేక నిరాశ, నిస్పృహతో బాధపడుతున్న యువత ఒక వైపు, ఇంటి నుంచి బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి వస్తామనే గ్యారంటీ లేక భయంతో ఉన్న మహిళలు మరో వైపు, అడ్డగోలు ధరల కారణంగా జీవితం భారంగా మారిన జనసామాన్యం మరో వైపు, ఇలా ప్రతి కోణంలో అభద్రతాభావం మరియు నిరాశతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ధైర్యం ఇచ్చారు నారా లోకేశ్(Nara Lokesh).
మొత్తంగా, లోకేశ్ 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, ఎనిమిది రచ్చబండలు నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి 4,353 వినతిపత్రాలు అందుకున్నారు. వివిధ సామాజిక వర్గాలు, వృత్తి చేసేవారు నేరుగా లోకేశ్‌ను కలుసుకుని తమ కష్టాలను చెప్పుకున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నర మంది ప్రజలతో నారా లోకేశ్(Nara Lokesh) మమేకమయ్యారు.
లోకేశ్‌తో సెల్ఫీ(Selfie With Lokesh):
సెల్ఫీ చాలెంజ్ పేరిట టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి విజయగాథలు మరియు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రదర్శించడం ద్వారా టీడీపీ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. వినూత్న రీతిలో కేడర్‌కు మరియు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రారంభించిన ‘సెల్ఫీ విత్ లోకేశ్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో 3.5 లక్షల మందికిపైగా అభిమానులతో లోకేశ్ సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. యువ నేతతో సెల్ఫీ దిగిన వారికి ఆ ఫొటోల్ని స్కానింగ్ చేసి, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌లోడ్ చేశారు.
పాదయాత్రలో తనకు దృష్టి చెందిన సమస్యలను పరిష్కరించేందుకు, లోకేశ్ అధికార యంత్రాంగానికి 600కు పైగా లేఖలు రాశారు. పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయిన ప్రతిచోటా ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ, తమకు అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నారా లోకేశ్(Nara Lokesh) హామీ ఇచ్చారు.