Site icon HashtagU Telugu

Nara Lokesh : లోకేష్ రూటే స‌ప‌రేటు!

Lokesh Chaitanya Radham Paper Tdp

Lokesh Chaitanya Radham Paper Tdp

తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ఇటీవ‌ల స్లో అయ్యారు. చంద్ర‌బాబు స్పీడ్ గా క‌నిపిస్తున్నారు. ఈ ప‌రిణామం వ్యూహాత్మ‌క‌మా? ఉద్దేశ పూర్వ‌క‌మా? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో నానుతోంది. కాబోయే సీఎం లోకేష్ అంటూ ప్ర‌చారం చేసిన మాజీ మంత్రులు సైతం సైలెంట్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో చంద్ర‌బాబు ఒంట‌రి పోరాటం చేస్తున్నార‌నే సంకేతం వెళుతోంది.

సీఎం జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి లోకేష్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. తొలి రోజుల్లో ఆయ‌న దూకుడును వైసీపీ లైట్ గా తీసుకుంది. కోవిడ్ స‌మ‌యంలో ట్విట్ట‌ర్‌, జూమ్ మీటింగ్ లు పెట్ట‌డం ద్వారా జ‌గ‌న్ స‌ర్కార్ ను ఎంతోకొంత ఇబ్బంది పెట్టారు. విద్యార్థుల ప‌క్షాన నిలిచిన లోకేష్ 10th, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల విష‌యంలో ఆయ‌న చేసిన పోరాటానికి స‌ర్కార్ దిగొచ్చింది. అదే పంథాన ప‌లు ప్ర‌జా వ్య‌తిరేక అంశాల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా పోరాడుతూనే క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. ప‌ల్నాడు ప్రాంతంలో జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల హ‌త్య‌ల‌ను నిర‌సిస్తూ అక్క‌డికి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు, ఆ ప్రాంతంలో జ‌రిగిన అత్యాచార సంఘ‌ట‌న‌పై స్పందించారు. ఆ సంద‌ర్భంగా జ‌గ‌న్ స‌ర్కార్ మోహ‌రించిన పోలీసులు సంఖ్య‌ను గ‌మ‌నిస్తే లోకేష్ బ‌లం ఏమిటో తేలిపోయింది. క్షేత్ర‌స్థాయికి లోకేష్ వ‌స్తున్నాడంటే, పోలీసుల్ని భారీగా మోహ‌రించ‌డం గ‌మ‌నిస్తే జ‌గ‌న్ స‌ర్కార్ కు ఆయ‌నంటే ఎంత అలెర్ట్ అవుతుందో అర్థం అవుతోంది.

క్యాడ‌ర్ లో నూత‌నోత్సాహాన్ని నింప‌డానికి లోకేష్ డైలాగ్ ల‌ను మాస్ యాంగిల్ లో వినిపిస్తున్నారు. ఒంగోలు మ‌హానాడు హిట్ కావ‌డానికి కూడా ఆయ‌న తెర‌వెనుక వ్యూహం ఉంద‌ని టీడీపీ చెబుతోంది. అంతేకాదు, చంద్ర‌బాబు ప్ర‌తి వారం నిర్వ‌హిస్తోన్న మినీ మ‌హానాడులు విజ‌య‌వంతానికి కార‌ణం కూడా లోకేష్ అంటూ త‌మ్ముళ్లు చెప్పుకుంటున్నారు. కానీ, జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు అనే అంశం తెర‌మీద‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చిన‌బాబు క్ర‌మంగా సైలెంట్ అవుతూ వ‌చ్చార‌ని తెలుస్తోంది. క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌కు దాదాపుగా నెల రోజుల నుంచి లోకేష్ దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించ‌డం వ‌ర‌కు ప‌రిమితం అయ్యారు. ఈ ప‌రిణామం ఎంటి? అనే దానిపై పార్టీ అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

అక్టోబ‌ర్ 2వ తేదీ త‌రువాత ఏ రోజైనా లోకేష్ పాద‌యాత్ర ఖ‌రారు అవుతుంద‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. అందుకోసం సిద్ధం అవుతోన్న ఆయ‌న ప్ర‌స్తుతం కొంత స్లో అయ్యార‌ని కొంద‌రు చెబుతున్నారు. మ‌రికొంద‌రు జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు వ్య‌వ‌హారం ఆయ‌న‌కు న‌చ్చ‌డంలేద‌ని చెప్పుకుంటున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయించే లోకేష్ ఈసారి టీడీపీ ఒంట‌రిగా అధికారంలోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నార‌ట‌. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ప్పుడ‌ల్లా అభిప్రాయ‌భేదాలు వ‌స్తున్నాయ‌ని టాక్. అంతేకాదు, ఒక విభాగం మీడియాను చంద్ర‌బాబు న‌మ్ముతున్నార‌న్న‌ విష‌యంలోనూ పొర‌పొచ్చాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. సొంత సోష‌ల్ మీడియాను న‌మ్ముకోవ‌డం ద్వారా అధికారంలోకి రావ‌చ్చ‌ని లోకేష్‌ అండ్ టీమ్ విశ్వసిస్తోంద‌ని స‌మాచారం. కొన్ని సంద‌ర్భాల్లో సానుభూతి మీడియా రూపంలో టీడీపీకి అన్యాయం జ‌రిగిన అంశాల‌ను ఆయ‌న అనుచ‌రులు గుర్తు చేసుకుంటున్నార‌ట‌. అందుకే, పూర్తిగా మీడియాను కాకుండా సొంత సోష‌ల్ మీడియా, స‌ర్వే సంస్థ‌ల‌ను లోకేష్ న‌మ్ముకున్నారని వినికిడి.

జ‌న‌సేన‌తో పొత్తు, సానుభూతి మీడియా ముసుగులోని వికృత వ్య‌వ‌హారాలు, స‌ర్వే ఫ‌లితాల విష‌యంలో చంద్ర‌బాబు, లోకేష్ మ‌ధ్య పొర‌పొచ్చాలున్నాయ‌ని ఆ పార్టీ అంతర్గ‌త వ‌ర్గాల్లోని గుసగుస‌లు. అందుకే, ఇటీవ‌ల లోకేష్ కొంచం స్లో అయ్యార‌ని తెలుస్తోంది. పైగా లోకేష్ ఫోక‌స్ కావ‌డాన్ని ఒక విభాగం మీడియా మైన‌స్ గా చూపిస్తుంద‌ని టాక్‌. లోకేష్‌ పాద‌యాత్ర తేదీ ప్ర‌క‌టించే వ‌ర‌కు ఇలాంటి అపోహ‌లు, ప్ర‌చారాల‌కు బ్రేక్ ప‌డేలా లేదు. చంద్ర‌బాబు మినీ మ‌హానాడులు ముగిసిన వెంట‌నే లోకేష్ క్షేత్ర‌స్థాయికి వ‌స్తార‌ని ఆయ‌న అభిమానులు చెబుతున్నారు. మొత్తం మీద లోకేష్ స్లో వెనుక వ్యూహాత్మ‌క అడుగులు ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.