Nara Chandrababu: 2024 దిశ‌గా చంద్ర‌బాబు సొంత మీడియా

సింహం ఒక‌డుగు వెన‌క్కు వేసిందంటే శ‌క్తిని కూడ‌గ‌ట్టుకుంటోంద‌ని అనుకోవాల‌ట‌.

  • Written By:
  • Updated On - July 20, 2022 / 02:29 PM IST

సింహం ఒక‌డుగు వెన‌క్కు వేసిందంటే శ‌క్తిని కూడ‌గ‌ట్టుకుంటోంద‌ని అనుకోవాల‌ట‌. ఆ విష‌యాన్ని ప్ర‌వ‌చ‌న క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు చెప్పిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఇదే ప్ర‌వ‌చ‌నాన్ని చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు వ‌ర్తింప చేస్తూ 2024 నాటికి స‌ర్వ‌శ‌క్తుల‌ను ఒక‌టి చేస్తున్నారని భావించారు. ఆ క్ర‌మంలో బ‌ల‌మైన మీడియాతో పాటు స‌మాంత‌రంగా సొంత సోష‌ల్ మీడియాను క్రియేట్ చేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. అన్ని పార్టీల‌కు ఉన్న‌ట్టు టీడీపీకి కూడా సానుభూతి మీడియా ఉంది. కానీ, టీఆర్ఎస్, వైసీపీల‌కు ఉన్న‌ట్టుగా సొంత మీడియా లేదు. వాటికి చెక్ పెట్టేందుకు స‌మాంత‌రంగా సోష‌ల్ మీడియాను నిర్మించే ప్ర‌య‌త్నం టీడీపీ చేస్తోంది. ఆ క్రమంలో `చైత‌న్య‌ర‌థం` పేరుతో ఈ -పేప‌ర్ ను తీసుకుంది. ప్ర‌తి రోజూ 70ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ భావ‌జాలం, దిశానిర్దేశం చేసేలా ఆ ప‌త్రిక‌ను న‌డ‌పాల‌ని పెద్ద టీమ్ ను రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించిన ఈ- పేప‌ర్ పాఠ‌కుల‌కు చేరుతోంది. కానీ, ఆశించిన ఫ‌లితాలు రావ‌డంలేద‌ని ఇటీవ‌ల లోకేష్ టీం అధ్య‌య‌నం చేసింది. కొంద‌రు వైసీపీ కోవ‌ర్టులు ఆ పేప‌ర్లో ప‌నిచేయ‌డానికి ఉగ్యోగులుగా చేరార‌ని ప్రాథ‌మికంగా గుర్తించార‌ని తెలుస్తోంది. వాళ్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో పాటు నికార్సైన టీడీపీ సానుభూతిప‌రుల కోసం అన్వేష‌ణ చేస్తున్నార‌ని వినికిడి. ఇలా, చైత‌న్య ర‌థాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డం ద్వారా ఇంటిని చ‌క్క‌దిద్దుతున్నారు.

20ఏళ్ల పాటు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఉన్నప్పటికీ, పేపర్లు, టీవీలు ఆలోచ‌న చేయ‌లేదు. సొంత మీడియా పెట్టాల‌న్న ప్ర‌ణాళిక చేయ‌లేదు. కానీ, కొన్ని మీడియా సంస్థ‌లు మాత్రం కొన్నేళ్లుగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తూ వ‌చ్చాయి. కొన్ని సంద‌ర్భాల్లో అదే మీడియా సంస్థ‌లు కొన్ని చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ప‌నిచేశాయి. మళ్లీ ఇప్పుడు అదే మీడియా హౌస్ లు చంద్ర‌బాబు కావాల‌ని అనుకుంటున్నాయి. ఇలా ఆయా సంస్థ‌లు స్టాండ్స్ మార్చుకున్న విష‌యం తెలిసి కూడా సొంత మీడియా ఉండాల‌న్న ఆలోచ‌న బాబు చేయ‌లేదు. కానీ, ప్ర‌స్తుతం మారిన ప‌రిస్థితుల్లో మీడియా కంటే బ‌లంగా త‌యారవుతోన్న సోష‌ల్ మీడియా మీద టీడీపీ శ్ర‌ద్ధ పెట్టింది. టీడీపీ సమాచార స్రవంతిని కార్యకర్తలకు, ప్రజలకు చేరవేయ‌డానికి చైత‌న్య రథం పేరుతో ఈ-పేప‌ర్ ద్వారా చంద్ర‌బాబు నేరుగా మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క క్లిక్ తో చైతన్యరథం ఈ-పేపర్ ను 30 లక్షల మందికి చేరేలా ప్లాన్ చేశారు. జ‌గ‌న్ స‌ర్కార్ చేస్తోన్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడానికి చైతన్యరథాన్ని ప్ర‌యోగిస్తున్నారు. మారిన ప‌రిణామాల దృష్ట్యా అత్య‌ధిక మీడియా విభాగం సొంత ఎజెండాను ఎంచుకుంటోంది. అందుకే, సొంత మీడియా అవివార్య‌మ‌ని భావించిన చంద్ర‌బాబు ఈ-పేప‌ర్ దిశ‌గా తొలి అడుగు వేశారు.

వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ ప్లాట్ ఫార‌మ్స్ తో పాటుగా వివిధ ర‌కాల యాప్ ల ద్వారా సొంత మీడియాను ఫోక‌స్ చేయాల‌ని ప్లాన్ చేశారు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ, 20 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, పేపర్లు, టీవీలు పెట్టాలనే ఆలోచన ఏనాడూ చేయ‌లేదు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబుకు ఆలోచ‌న రావ‌డానికి కార‌ణం సానుభూతి మీడియాగా ఉంటూ ఆయ‌న్ను చాలా సంద‌ర్భాల్లో త‌ప్పుదోవ ప‌ట్టించింది. ప్రపంచ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూనే, గ్రామాలవారీగా జరిగే వాటిని సేకరించి, అందరికీ చేరువయ్యేలా ఈ-పేప‌ర్ ను న‌డుపుతున్నారు. మీడియాపై ఆంక్షలుపెట్టేలా జీవోనెం 2430 తీసుకొచ్చిన క్ర‌మంలో చంద్ర‌బాబు సానుభూతి మీడియా కూడా దాదాపు ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజాన్ని ప‌క్క‌న పెట్టేసింది.

ఏపీని కాపాడుకోవడానికి, టీడీపీని బ‌ల‌పేతం చేసుకోవ‌డానికి వైసీపీ త‌ర‌హాలోనే సొంత మీడియా అవ‌స‌ర‌మ‌ని చంద్ర‌బాబు ప్ర‌గాఢంగా నమ్మారు. ప్ర‌స్తుతం సానుభూతి మీడియా ఎప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో తెలియ‌ని ఆయోమ‌యం ఉంద‌ని టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఎందుకంటే, 2009 నుంచి 2017 వ‌రకు బాహాటంగా వ్య‌తిరేకించిన మీడియా హౌస్ లు ఇప్పుడు చంద్ర‌బాబు పాట పాడుతున్నాయి. రాబోవు రోజుల్లో ఆ మీడియా హౌస్ లు టీడీపీపై వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌డానికి అవ‌కాశం లేక‌పోలేద‌ని ఆ పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లోని టాక్‌. అందుకే, గ‌తంలో మాదిరిగా కాకుండా సానుభూతి మీడియాకు స‌మాంత‌రంగా సొంత మీడియాతో పూర్తిస్థాయి శ‌క్తిని కూగ‌ట్టుకుని 2024 ఎన్నిక‌ల బ‌రిలోకి వెళ్ల‌బోతున్నార‌ని స‌ర్వ‌త్రా పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఎన్నో మీడియా హౌస్ ల‌ను చంద్ర‌బాబు చూశారు. వాళ్ల ఎత్తుగ‌డ‌ల‌ను గ‌మ‌నించారు. సంద‌ర్భానుసారంగా వాళ్లు మార్చిన స్టాండ్స్ తెలుసు. అయిన‌ప్ప‌టికీ పార్టీని న‌ష్ట‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించిన మీడియాను ఏనాడూ క‌క్ష‌క‌ట్ట‌లేదు. అదే మీడియా మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌యిన‌ప్పుడు కాద‌న‌లేదు. బ‌హుశా అదే ఆయ‌నకు పెద్ద మైన‌స్ పాయింట్. ఆ త‌ప్పు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా ప్ర‌స్తుతం లోకేష్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు. సొంత మీడియాను విస్త‌రింప చేస్తూ దూకుడుగా వెళుతున్నారు. మొత్తం మీద దెబ్బ‌తిన్న సింహంలా జ‌రిగిన త‌ప్పుల‌ను నెమ‌రువేసుకుంటూ మ‌రోసారి ఓడిపోకుండా వేటాడ‌డానికి జాగ్ర‌త్త గా 2024 దిశ‌గా అడుగులు వేస్తూ చంద్రబాబు శ‌క్తిని కూడగట్టుకు౦టునారు.