Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి కలిసి శనివారం అర్ధరాత్రి అమెరికాకు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి అమెరికాకు వెళ్లారు. వారం పాటు చంద్రబాబు దంపతులు అమెరికాలోనే ఉండనున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 16నే అమెరికాకు వెళ్లారు.జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. దానికి ఇంకా టైం ఉండటంతో వివిధ పార్టీల అగ్రనేతలు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఇటీవలే వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా కోర్టు అనుమతి తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 13న ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ముగిసింది.
We’re now on WhatsApp. Click to Join
చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారని టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా ఒకసారి ఆయన అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం యూఎస్‌కు వెళ్లారు. పరీక్షలు పూర్తయ్యాక ఐదారు రోజుల్లో చంద్రబాబు(Chandrababu) తిరిగి రాష్ట్రానికి రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏపీ సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్‌లోనే ఉంటున్నారు. అక్కడే వారు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు జగన్ వెళ్లారు. ఈనెల 17న జగన్ లండన్‌కు వెళ్లగా.. విదేశీ పర్యటన అనంతరం తిరిగి ఈ నెల 31న ఏపీకి రానున్నారు.