Site icon HashtagU Telugu

Balakrishna vs Jr NTR : బాలయ్య Vs జూనియర్ ఎన్టీఆర్

Nandamuri Balakrishna Vs Junior Ntr

Nandamuri Balakrishna Vs Junior Ntr

By: డా. ప్రసాదమూర్తి

Balakrishna vs Jr. NTR : చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆంధ్ర రాజకీయాల్లో పరిణామాలు గాలి కంటే వేగంగా మలుపులు తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టు అనివార్యమైన తర్వాత ఏసీబీ కోర్టులో ఆయనకు ఊరట లభిస్తుందని అనుకున్నారు. గృహ నిర్బంధంలో ఉంచమని చేసుకున్న అభ్యర్థన న్యాయమూర్తి కొట్టి పారేశారు. చంద్రబాబుకు జైలు తప్పనిసరి అయింది. ఆయనకు బెయిల్ ఎప్పుడు వస్తుందో.. అసలు రాదో తెలియదు. ఆయన కలకాలం జైలులో కాలక్షేపం చేయాల్సిందేనని ఒకపక్క అధికార వైసిపి నాయకులు దండోరా వేస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు.

ఒక కేసులో బయటపడినా మరో కేసు, దాంట్లో బయటపడినా ఇంకో కేసు, ఇలా అనేక కేసుల్లో ఆయన్ని ఇరికించి, శాశ్వతంగా చంద్రబాబును జైలు స్థాపితం చేయాలని వైసిపి వర్గాలు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆయనతో పాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఇలా రోజురోజుకీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పరిస్థితి అయోమయంలో పడిపోతోంది. ఈ స్థితిలో జెండాను నిలబెట్టేది ఎవరు? పార్టీని ముందుకు తీసుకెళ్లేదెవరు? దగ్గర పడుతున్న ఎన్నికల్లో అధికార పార్టీకి బలమైన పోటీని ఇచ్చేది ఎవరు? నాయకుడే లేకపోతే పార్టీ పరిస్థితి ఏమైపోతుంది? ఇలాంటి ఆందోళనలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పడిపోయారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతోపాటు లోకేష్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే పార్టీని ముందుండి నడిపే చరిష్మా ఎవరికీ ఉందన్న ఆలోచనలు చర్చలు సాగడం మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) రంగంలోకి దిగితే పసుపు జెండా ప్రాభవం ఏ మాత్రం తగ్గదని, పార్టీ అధినేత, ఆయన తనయుడు జైల్లో ఉన్నా కూడా పార్టీని విజయం దిశగా నడిపించగల సత్తా దమ్ము ప్రజల్లో క్రేజ్ ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని, ఆయన చేతికే పగ్గాలు అప్ప చెప్పాలన్న ఆలోచనలు వాదనలు మొదలైపోయాయి.

అయితే ఇంత జరుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడని జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల తన సానుభూతిని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయని జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), ఇప్పుడు అర్జెంటుగా రంగంలోకి వచ్చి నేనున్నాను, ముందుండి అన్నీ చూసుకుంటాను అని అంటారా? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. అలా అనేవాడే అయితే ఈపాటికే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునేవాడు కాదు. గతంలో విజయవాడ వైద్య విశ్వవిద్యాలయం పేరులో ఎన్టీఆర్ పేరును తొలగించినప్పుడు కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. అప్పుడు కూడా తెలుగు దేశం పార్టీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ వెనుకబడ్డారు. విపరీతంగా ట్రోల్ చేశారు. అయినా అతను నోరెత్తలేదు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

మరి చంద్రబాబు కుటుంబంతో గాని ఎన్టీఆర్ కుటుంబంతో గాని సత్సంబంధాలు అంతగా లేని జూనియర్ ఎన్టీఆర్ ని బతిమాలు బామాలి పార్టీ పగ్గాలు అప్పజెప్పడం ఏమంత భావ్యం అని తెలుగుదేశం పార్టీలోని పలువురు భావిస్తున్నారు. పార్టీ దిక్కులేనిది అయిపోతుందా అన్న ఆందోళన ఒకవైపు, జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) పగ్గాలు చేపడితే చంద్రబాబు కుటుంబం తిరిగి పురా వైభవాన్ని పొందడం కష్టమన్న అనుమానం మరొకవైపు ఇలా ఎన్నో అంశాల మీద తెలుగుదేశం వర్గాలు తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.

అందుకే బాలయ్య (Balakrishna) రంగప్రవేశం అనివార్యమైంది. బాలయ్య ఎన్టీఆర్ కుమారుడైనప్పటికీ ఆయన చంద్రబాబు వియ్యంకుడు.. లోకేష్ కి మామగారు కూడా. అందుకే బాలయ్య తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడితే భవిష్యత్తులో లోకేష్ కి గాని చంద్రబాబుకు గాని ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వారు ఎప్పుడు బయటకు వచ్చినా తమ అధికారం తమకు దక్కుతుందని ధీమాగా ఉండవచ్చు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి వస్తే లోకేష్, ఆ హీరోకి సైడ్ హీరోగా ఉంటారా? అది జరిగే పని కాదు. మరి లోకేష్ మెయిన్ హీరో అయితే జూనియర్ ఎన్టీఆర్ సైడ్ హీరోగా తనను తాను తగ్గించుకొని పార్టీ కోసం పని చేస్తాడా? అంటే అది వీలయ్యే పని కాదు. కాబట్టి లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ రెండు కత్తులు ఒక వొరలో ఒదిగే పని కాదు.

అలాగే చంద్రబాబు జైలులోనే కొంతకాలం ఉండాల్సి వస్తే ముందుండి నడిపే అంత నాయకత్వ స్థాయి, రాజకీయ పరిణతి, ప్రజల్లో క్రేజ్ లోకేష్ లేదని పార్టీ వర్గాల్లో బహిరంగంగా కాకున్నా లోలోపలైనా అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ఈ తరుణంలో ఇటు చంద్రబాబు స్థానాన్ని భర్తీ చేయడానికి, పార్టీని ఆదుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ కావాలన్న డిమాండ్ ను బలంగా తిప్పి కొట్టడానికి ఏకైక సాధనంగా బాలయ్య (Balakrishna) మాత్రమే కనపడుతున్నాడు. మరి అందుకే ఇప్పుడు బాలయ్య బాబు, తొడ కొట్టి నేనున్నాను, నేను ముందుంటాను అంటున్నారు.

ఆయన మాటిమాటికి నేను నేను అనడంలో ఉద్దేశం ఏమిటో తెలియదు గానీ, పరిస్థితులు ఎటు తిరిగి ఎటు వచ్చినా పార్టీని ఒంటి చేత్తో నిలబెట్టడానికి బాలయ్య ఉన్నాడు, మీరేం దిగులు చెందవద్దని ఆయన అటు పార్టీకి, ఇటు ఏపీ ప్రజలకు నొక్కి వక్కాణిస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి పరిణామాలు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ కి అవకాశాలు ఏమీ కనిపించడం లేదు. ఒకవేళ ఉన్నా ఆయన తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మీద వల పన్ని ఉంచిన బిజెపి ఉండనే ఉంది. సో.. బాలయ్య చక్రం తిప్పే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కాకుంటే ఆయన తిప్పే చక్రం నిజమైన విష్ణు చక్రం అవుతుందా.. దీపావళి విష్ణుచక్రంలా తుస్సుటుందా? కాలమే చెప్పాలి.

Also Read:  Chandrababu : సోమవారం వరకు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దు : హైకోర్టు