AP Politics : టీడీపీలోకి కిర‌ణ్ కుమార్ రెడ్డి? వైఎస్ `ఆత్మ` ఎఫెక్ట్‌!!

ఉమ్మ‌డి ఏపీ చివ‌రి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డికి మ‌ళ్లీ చేదుఅనుభ‌వం ఎదురైయింది. ఏపీ పీసీసీ చీఫ్ ప‌ద‌విని ఆశించి ఆయ‌న భంగ‌ప‌డ్డారు.

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 12:52 PM IST

ఉమ్మ‌డి ఏపీ చివ‌రి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డికి మ‌ళ్లీ చేదుఅనుభ‌వం ఎదురైయింది. ఏపీ పీసీసీ చీఫ్ ప‌ద‌విని ఆశించి ఆయ‌న భంగ‌ప‌డ్డారు. దీంతో ఆయ‌న ప్రత్యామ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేర‌డ‌మా? లేక బీఆర్ఎస్ పార్టీ ప‌గ్గాల‌ను తీసుకోవ‌డమా? బీఎస్పీ పార్టీ ఏపీ క‌న్వీన‌ర్ కావ‌డమా? అనే దానిపై దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్ప‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని ఆయ‌న వ‌ర్గీయుల్లోని టాక్‌.

ఏపీ విభ‌జ‌న బిల్లును విజ‌య‌వంతంగా అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీ పంపిన ఉమ్మ‌డి ఏపీ చివ‌రి సీఎంగా కిర‌ణ్ కుమార్ రెడ్డికి పేరుంది. ఆ రోజున అసెంబ్లీని ర‌ద్దు చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ప‌ద‌వి కోసం సోనియా ఆదేశానుసారం విభ‌జ‌న బిల్లును ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన కిర‌ణ్ కుమార్ రెడ్డి విచిత్రంగా స‌మైఖ్యాంధ్ర పార్టీతో 2014 ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఆయ‌న‌తో పాటు ఆ పార్టీ త‌ర‌పున బ‌రిలోకి దిగిన వాళ్ల‌కు నోటా కంటే త‌క్కువ ఓట్లు ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఆనాటి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన కిర‌ణ్ కుమార్ రెడ్డి ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ పార్టీ గూటికి తిరిగి చేరారు. అప్పటి నుంచి పీసీసీ చీఫ్ ప‌ద‌విని ఆశిస్తూ వ‌చ్చారు. కానీ, మాజీ మంత్రి ర‌ఘువీరారెడ్డిని పీసీసీ చీఫ్ గా తొల‌గించిన త‌రువాత పీసీసీ చీఫ్ గా డాక్ట‌ర్ శైల‌జానాథ్ ను ఏఐసీసీ ఎంపిక చేసింది.

ఇటీవ‌ల ఏఐసీసీ అధ్యక్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ఆక‌స్మాత్తుగా ఏపీ పీసీసీ చీఫ్ శైల‌జానాథ్‌ను తొల‌గిస్తూ ఆ బాధ్య‌త‌ల‌ను గిడుగు రుద్ర‌రాజుకు అప్ప‌గించారు. ఇదంతా కాంగ్రెస్ ఏపీ కురువృద్ధుడు కేవీపీ చేసిన వ్యూహంలో భాగ‌మ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఫ‌లితంగా ఇప్ప‌ట్లో కిర‌ణ్ కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ ప‌ద‌వి అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోయింది. దీంతో ప్ర‌త్యామ్నాయం దిశ‌గా ఆయ‌న అడుగులు పడుతున్నాయ‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చిత్తూరు రాజ‌కీయాల‌ను ఒక‌ప్పుడు శాసించిన `న‌ల్లారి` ఫ్యామిలీ మ‌ళ్లీ పూర్వ వైభ‌వం కోసం పాకులాడుతోంది. ఆ జిల్లాలో ప్ర‌స్తుతం చంద్ర‌బాబు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హ‌వా కొన‌సాగుతోంది. వాళ్లిద్ద‌రూ `న‌ల్లారి` కుటుంబానికి రాజ‌కీయ తొలి శ‌త్రువులు. స్వ‌ర్గీయ వైఎస్ హ‌యాంలో మంత్రి ప‌ద‌వి రాకుండా పెద్దిరెడ్డి చాడీలు చెప్పార‌ని ఇటీవ‌ల బాల‌య్య నిర్వ‌హిస్తోన్న అన్ స్టాప‌బుల్ షోలో కిర‌ణ్ కుమార్ రెడ్డి ప‌రోక్షంగా చెప్పిన మాట‌లు. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ రాజ‌కీయాల‌ను చేస్తోన్న మంత్రి పెద్దిరెడ్డిని త‌ట్టుకోవాలంటే టీడీపీతో స‌ఖ్య‌త‌గా ఉండ‌డం ఒక మార్గంగా కిర‌ణ్ కుమార్ రెడ్డికి కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా చేసిన కిర‌ణ్ క‌మార్ రెడ్డి మామూలు లీడ‌ర్ మాదిరిగా టీడీపీలో చేర‌డానికి `ఇగో` అడ్డువ‌స్తుంద‌ని ఆయ‌న వ‌ర్గీయుల్లోని కొంద‌రు అభిప్రాయం. మ‌ధ్యే మార్గంగా ఢిల్లీ రాజ‌కీయాల బాధ్య‌త‌ల‌ను ఇస్తూ చంద్ర‌బాబు సంకేతాలు ఇస్తే టీడీపీ గూటికి చేరే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇక మిగిలిన రెండు ప్ర‌త్యామ్నాల్లో ఒక‌టి బీఆర్ఎస్ పార్టీ. ఇటీవ‌ల జాతీయ పార్టీగా టీఆర్ఎస్ రూపాన్ని సంత‌రించుకుని బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించింది. ఆ పార్టీ బ‌లోపేతం కోసం స‌న్నిహితుల‌తో కేసీఆర్ ఏపీ మీద ఆప‌రేష‌న్ చేస్తున్నారు. ఆ క్ర‌మంలో విభ‌జ‌న బిల్లును విజ‌య‌వంతంగా అసెంబ్లీలో పాస్ చేసిన‌ కిర‌ణ్ కుమార్ రెడ్డికి ఏపీ చీఫ్ బాధ్య‌త‌లు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. లేదంటే మ‌రో ఆప్ష‌న్ గా బీఎస్పీ పార్టీ కిర‌ణ్ కు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలంగాణ క‌న్వీన‌ర్ గా ఉన్నారు. బ‌ల‌మైన లీడ‌ర్ కు ఏపీ బాధ్య‌త‌ల‌ను అప్పగించాల‌ని చూస్తోన్న క్ర‌మంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి `సై` అంటే ఓకే అవుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇప్పుడు ఆయ‌న తీసుకునే ప్ర‌త్యామ్నాయం నిర్ణ‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.