MLA Roja Selvamani : టీడీపీలోకి ఎమ్మెల్యే రోజా?

క్యాబినెట్ లో చోటుపై ఆశ‌లు పోతున్నాయా? వైసీపీలో ఆమె ఇమ‌డ‌లేక‌పోతున్నారా?

  • Written By:
  • Updated On - February 5, 2022 / 03:17 PM IST

క్యాబినెట్ లో చోటుపై ఆశ‌లు పోతున్నాయా? వైసీపీలో ఆమె ఇమ‌డ‌లేక‌పోతున్నారా? శ్రీశైలం ఆల‌య పాల‌క మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి చ‌క్ర‌పాణి రెడ్డికి ఇవ్వ‌డంతో రోజా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారా? ఫైర్ బ్రాండ్ రోజా (MLA Roja Selvamani) రాజీనామాకు ఎందుకు సిద్ధ‌ప‌డుతోంది? మ‌ళ్లీ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఆమె అభిమానుల్లో ఉద‌యిస్తున్నాయి. తాజాగా వైసీపీ పార్టీలో జ‌రుగుతోన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే..రోజా ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవ‌కాశం ఉంద‌ని న‌గ‌రి వైసీపీలోని ఒక గ్రూప్ భావిస్తోంది.గ‌త ఏడాది ఏపీఐసీసీ చైర్మ‌న్ (APICC Chairman) ప‌ద‌వి నుంచి రోజాను ఏపీ స‌ర్కార్ త‌ప్పించింది. ఆ రోజు నుంచి ఆమెను జ‌గ‌న్ కోట‌రీ దూరంగా పెడుతూ వ‌స్తోంది. తాడేప‌ల్లి భేటీల‌కు కూడా ఆమెకు అవ‌కాశం రావ‌డంలేదు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని వ్య‌తిరేక గ్రూప్ కు జ‌గ‌న్ పెద్ద‌పీట వేస్తున్నాడు. ఆమెకు ఉన్న క్యాబినెట్ ర్యాంకు ప‌ద‌విని తొల‌గించ‌డంతో పాటు రోజాకు రాజ‌కీయ శత్రువుగా ఉన్న రెడ్డివారి చ‌క్ర‌పాణిరెడ్డికి శ్రీశైలం ఆల‌య పాల‌క మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌విని జ‌గ‌న్ ఇచ్చాడు. ఇటీవ‌ల ప‌లు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను(Nominated Posts) రోజా వ్య‌తిరేకులు నేరుగా తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి పొందారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే, పొమ్మ‌న‌లేక రోజాకు పొగ పెడుతున్న‌ట్టుగా ఉంది.

ప‌లు సంద‌ర్భాల్లో రోజాకు వ్య‌తిరేక గ్రూప్ నుంచి అవ‌మానం జ‌రిగింది. ఇటీవ‌ల జ‌రిగిన సీఎం జ‌గ‌న్ బ‌ర్త్ డే నాడు న‌గ‌రిలో నిర్వ‌హించిన భారీ ర్యాలీకి ఆమెను దూరంగా పెట్టారు. క‌నీసం హోర్డింగ్ లు, బ్యాన‌ర్ల‌లో కూడా రోజా ఫోటో లేకుండా చేశారు. ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో వ్య‌తిరేక గ్రూప్ పై పైచేయి సాధించిన‌ప్ప‌టికీ వాళ్ల నుంచి ప్ర‌తిఘ‌ట‌న త‌ట్టుకోలేక‌పోతోంది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని నిండ్ర ఎంపీపీగా త‌న సొంత మ‌నిషిని నియ‌మించుకోవ‌డంలో రోజా ఆనాడు విజ‌యం సాధించింది. కానీ, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, మున్సిప‌ల్ మెంబ‌ర్లు ఎక్కువ‌గా రోజా వ్య‌తిరేక గ్రూప్ వాళ్లు ఉన్నారు. ఆమె సొంత మ‌నుషుల‌ను గెలుపించుకోలేక పోయింద‌న్న అపవాదు ఉంది.న‌గ‌రి మున్సిపల్‌ మాజీ చైర్మన్ కేజే కుమార్‌, కేజే శాంతి (Nagari Ex  Muncipal Chairman KJ Kumar, KJ Shanti) దంపతులు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్నారు. వాళ్ల‌తో రోజాకు ఏ మాత్రం పొస‌గ‌డంలేదు. నగరి వైసీపీ లీడ‌ర్ గా కేజే కుమార్ ఫోక‌స్ అవుతున్నాడు. స్థానిక ఎమ్మెల్యే రోజా సిఫార్సు లేకుండా కేజే కుమార్ భార్య శాంతి ఏకంగా కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవిని చేజిక్కించుకుంది. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా బీ ఫారంల‌ను ఇచ్చే విష‌యంలో కూడా రోజా పాత్ర నామ‌మాత్రం. అక్క‌డ కుమార్‌, శాంతి గ్రూప్ పైచేయిగా ఉంది. ఇక‌ నిండ్ర మండ‌లం మొత్తం చక్రపాణిరెడ్డి వర్గం, పుత్తూరు ప‌రిధిలో అమ్ములు వర్గం, విజయపురం ప్రాంతంలో లక్ష్మీపతిరాజు వర్గం, వడమాలపేటలో మాజీ ఎంపీపీ మురళీరెడ్డి వర్గం..ఇలా ప్ర‌తిచోటా రోజాకు వ్య‌తిరేక గ్రూప్ లు బ‌లంగా ఉన్నాయి.

సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో (Telugu Desam Party ) రోజా ప‌నిచేసింది. తెలుగు మ‌హిళా అధ్యక్షురాలిగా 1999 నుంచి 2009 వ‌ర‌కు ఉంది. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున 2004, 2009 ఎన్నిక‌ల్లో పోటీ చేసి వ‌రుస‌గా ఓడిపోయింది. ఆ త‌రువాత స్వ‌ర్గీయ వైఎస్ చేసిన ఆప‌రేష‌న్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరి త‌దినంత‌రం జ‌గ‌న్ స్థాపించిన వైసీపీలోకి వెళ్లింది. న‌గ‌రి నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా వైసీపీ నుంచి ఆమె గెలుపొందింది. తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్లిన సంద‌ర్భంగా టీడీపీ లోని ఒక గ్రూప్ ఆమెను అనుస‌రించింది. దీంతో అప్ప‌టికే వైసీపీలో ఉన్న గ్రూప్ కు రోజాతో ట్రావెల్ అయిన గ్రూప్ కు మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. ఫ‌లితంగా తొలి నుంచి వైసీపీలోని బ‌ల‌మైన గ్రూప్ తో రోజా అంత‌ర్గ‌తంగా పోరాడుతూనే ఉంది. అయితే, ఇటీవ‌ల ఆ గ్రూప్ కు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి (Peddireddy Rama Chandra Reddy) అండ‌గా నిలిచాడ‌ని టాక్‌.క్యాబినెట్ లో స్థానం కోసం చాలా కాలంగా రోజా ఎదురుచూస్తోంది. తొలి క్యాబినెట్ లోనే జ‌గ‌న్ అవ‌కాశం ఇస్తాడ‌ని ఆమె భావించింది. కానీ, సామాజిక స‌మీక‌ర‌ణాల దృష్ట్యా పెద్దిరెడ్డికి మాత్రమే చిత్తూరు నుంచి ఛాన్స్ ద‌క్కింది. ప్ర‌త్యామ్నాయంగా ఏపీఐసీసీ చైర్మ‌న్ ప‌ద‌విని ఇవ్వ‌డంతో కొంత మేర‌కు రోజా సంతృప్తి చెందింది. కానీ, ఇటీవ‌ల ఆ ప‌ద‌విని కూడా ఊడ‌పీకారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే క్యాబినెట్ మార్పు పై ఆమె ఆశ‌లు పెట్టుకుంది. ఉగాదిలోపుగా మంత్రివ‌ర్గం (AP Cabinet Reshuffle) మార్పులు ఉంటాయ‌ని భావిస్తున్నారు. దాన్లో స్థానం ఉంటుంద‌ని రోజా గ్రూప్ బ‌లంగా విశ్వ‌సిస్తోంది. ఒక వేళ మంత్రివ‌ర్గంలో అవ‌కాశం లేక‌పోతే..రాజీనామాకు ఆమె సిద్ధ‌ప‌డే ఛాన్స్ లేక‌పోలేదు. ఇప్ప‌టికే, చ‌క్ర‌పాణిరెడ్డి నామినేడెట్ ప‌ద‌విని పొందిన త‌రువాత రోజా రాజీనామా చేస్తానంటూ చెబుతున్నారు. వైసీపీలో ఉంటున్న‌ప్ప‌టికీ తెలుగుదేశం పార్టీలోని ఒక‌రిద్ద‌రు కీల‌క లీడ‌ర్ల‌తో ఆమె ట‌చ్ లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఆమె అసంతృప్తిని గ‌మ‌నించిన ఆ లీడ‌ర్లు మ‌ళ్లీ టీడీపీలోకి రావాల‌ని సందేశం ఇచ్చార‌ట‌. అయితే, రోజా నుంచి ఎలాంటి రియాక్ష‌న్ లేక‌పోయిన‌ప్ప‌టికీ తిరిగి రోజా టీడీపీలోకి వస్తార‌ని లీకులు ఇస్తున్నారు. బ‌హుశా ఇలాంటి లీకులు పొలిటిక‌ల్ గ్యాసిప్ కింద కూడా తీసుకోవ‌చ్చు. అయితే, మంత్రివ‌ర్గంలో స్థానం ల‌భించ‌క‌పోతే,రాజీనామా దిశ‌గా ఆమె నిర్ణ‌యం ఉంటుంద‌ని అభిమానులు చెబుతున్నారు. అదే, జ‌రిగితే..మ‌ళ్లీ టీడీపీ గూటికి రోజా రావ‌డం గ్యాసిప్ కాదు..నిజం అయ్యే ఛాన్స్ ఉంది.