AP Cabinet Reshuffle : మంత్రివ‌ర్గ మార్పుపై రోజా మార్క్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ కొత్త క్యాబినెట్ ఎలా ఉంటుంది? అనేది పెద్ద ప్ర‌శ్న‌. ఏ ఇద్ద‌రు క‌లిసిన‌ప్ప‌టికీ రోజాకు మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పిస్తారా? లేదా ?

  • Written By:
  • Publish Date - March 21, 2022 / 12:52 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్ కొత్త క్యాబినెట్ ఎలా ఉంటుంది? అనేది పెద్ద ప్ర‌శ్న‌. ఏ ఇద్ద‌రు క‌లిసిన‌ప్ప‌టికీ రోజాకు మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పిస్తారా? లేదా ? అంటూ చ‌ర్చించుకుంటున్నారు. ఆమె అభిమానులు మాత్రం ఒక అడుగు ముందుకేసి హోం మంత్రిగా రోజా బాధ్య‌త‌లు తీసుకోబోతున్నార‌ని విశ్వ‌సిస్తున్నారు. మ‌రికొంద‌రు అయితే, సినిమాటోగ్ర‌ఫీ లేదా మ‌హిళా శిశు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌ రోజాకు వ‌రించ‌నుంద‌ని భావిస్తున్నారు. ఇంకొంద‌రు రోజా స్పీక‌ర్ లేదా డిప్యూటీ స్పీక‌ర్ కాబోతుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇలా..క్యాబినెట్ మార్పు కంటే రోజాకు ల‌భించే మంత్రిత్వ‌శాఖ‌పై విస్తృతంగా చ‌ర్చ జ‌ర‌గ‌డం ఆమెకున్న క్రేజ్ ను తెలియ‌చేస్తోంది.చిత్తూరు జిల్లా న‌గ‌రి నుంచి వైసీపీ త‌ర‌పున 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుసుగా రెండుసార్లు ఆమె గెలిచింది. తొలి క్యాబినెట్ లోనే స్థానం ఉంటుంద‌ని ఆమె అభిమానులు ఊహించారు. కానీ, చిత్తూరు జిల్లాల్లోని రాజ‌కీయ ఈక్వేష‌న్లు రోజాకు ప‌ద‌వి రాకుండా అడ్డుప‌డ్డాయి. ప్ర‌త్యామ్నాయంగా ఏపీ ఐఐసీ చైర్మ‌న్ ప‌ద‌విని జ‌గ‌న్ ఇచ్చాడు. పూర్తి కాలంగా ఆ ప‌ద‌విలో ఉంచ‌కుండా హ‌ఠాత్తుగా తొలగించాడు. వైసీపీ అధిష్టానం ఆదేశాల మేర‌కు ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న ఆమె ప‌లుమార్లు జ‌గ‌న్ తో భేటీ కావ‌డానికి ప్ర‌య‌త్నం చేసింది. కానీ, అపాయిట్మెంట్ ల‌భించ‌లేదు. ఆ లోపు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రావ‌డంతో క్షేత్ర స్థాయిలో రోజా బిజీ అయింది. ఆ ఎన్నిక‌ల్లో రోజా వ్య‌తిరేక వ‌ర్గం పైచేయి సాధించింది. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెకు ఇప్పుడు బ‌ల‌మైన వ్య‌తిరేక గ్రూప్ త‌యారు అయింది. అక్క‌డి వివాదాల‌ను తీర్చ‌డానికి ఒకానొక స‌మ‌యంలో జ‌గ‌న్ చోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది.

ప్ర‌ధానంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ర్గం న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో రోజాకు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తోంది. పైగా రోజాకు చిత్తూరు జిల్లాలోని వైసీపీ లీడ‌ర్ల‌తో స‌ఖ్య‌త లేదు. ఆ జిల్లాకు చెందిన ఎమ్యెల్యేలు చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, భూమ‌న క‌రుణాకర్ రెడ్డి త‌దిత‌రులు మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డిని మంత్రివ‌ర్గంలో కొన‌సాగించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఒక వేళ రెండో మంత్రి ప‌ద‌వి అదే సామాజికవ‌ర్గానికి ఇవ్వాల‌నుకుంటే, చెవిరెడ్డి, భూమ‌న ముందు వ‌రుస‌లో ఉంటారు. వాళ్లిద్ద‌రి త‌రువాత మాత్ర‌మే రోజా ప్రాధాన్యం ఉంటుంది. పైగా రోజా కంటే సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు వాళ్లు. ఇలాంటి ఈక్వేష‌న్ న‌డుమ మంత్రి ప‌ద‌వి రోజాకు త‌క్క‌డం చాలా క‌ష్టమైన అంశం. ఏపీ ఐఐసీ చైర్మ‌న్ గా ఉన్న‌ప్పుడు రోజాపై ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అందుకు సంబంధించిన పూర్తి స‌మాచారం జ‌గ‌న్ వ‌ద్ద ఉంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల టాక్‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో మంత్రివ‌ర్గంలోకి రోజాను తీసుకునే అవ‌కాశం ఉందా? అంటే ఒకే ఒక మార్గాన్ని కొంద‌రు చెబుతున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ రెండో ప‌వ‌ర్ పాయింట్ గా ఉన్న ఎంపీ విజసాయిరెడ్డి ద్వారా లాబీయింగ్ చేస్తోంద‌ని ఆమె స‌హ‌చ‌రుల నుంచి అందుతోన్న స‌మాచారం. ప్ర‌త్యేక‌మైన కోణం నుంచి జ‌గ‌న్ వ‌ద్ద రోజాను ప్రొజెక్టు చేస్తున్నాడ‌ని వినికిడి. ఆయ‌న చేస్తోన్న లైజ‌నింగ్ ఫ‌లిస్తే మాత్రం రోజాకు క్యాబినెట్ బెర్త్ ఓకే అయ్యే అవ‌కాశం ఉంది. లేదంటే, స్పీక‌ర్ లేక డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని కొంద‌రి భావ‌న‌.
ఏపీ సీఎం జ‌గ‌న్ గురించి బాగా తెలిసిన వాళ్లు మాత్రం రోజాకు మంత్రి వ‌ర్గంలో అవకాశం ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక‌సారి నిర్ణ‌యం తీసుకున్న త‌రువాత జ‌గ‌న్ మ‌రే మ‌నిషి కాద‌ని చెబుతున్నారు. ఏపీ ఐఐసీ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తప్పించిన త‌రువాత అపాయిట్మెంట్ కూడా ఇవ్వ‌ని జ‌గ‌న్ ఆమెకు మంత్రి ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఒక వేళ సాయిరెడ్డి పాచిక పారిన‌ప్ప‌టికీ డిప్యూటీ స్పీక‌ర్ లేదంటే స్పీక‌ర్ వ‌ర‌కు రోజాను పరిమితం చేస్తార‌ని బ‌లంగా వినిపిస్తోంది. సో..రోజాకు మంత్రివ‌ర్గంలో స్థానం అంద‌ని ఎండ‌మావిగానే క‌నిపిస్తోంది.