MLC : ఇటీవల ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో ఆ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలో కూటమి పార్టీల నుంచి కూడా ఈ ఐదుగురు ఎమ్మెల్సీలను నియమించడానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు పేరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Hair Stolen: తెలుగులో మాట్లాడుతూ చోరీ.. రూ.1 కోటి జుట్టు మాయం
దీంతో నాగబాబును MLC గా ప్రకటించడంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబు తప్పుబట్టారు. ‘‘అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు’’ అని ట్వీట్టర్ లో పేర్కొన్నారు. కాగా, శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జన సేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, ప్రస్తుతం నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ సమాచారం ఇచ్చింది. పార్టీ పరంగా కూడా నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పవన్‌కళ్యాణ్ ఆదేశించారు. ఇకపోతే..అటు కూటమి ప్రభుత్వం నాగబాబుకు మంత్రి పదవిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎమ్మెల్సీతో నాగబాబుని ఆపేస్తారా? లేక మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నాగబాబు మంత్రి అయితే అన్నదమ్ములిద్దరూ మంత్రులుగా ఉన్న ఏకైక సభగా ఇది గుర్తింపు పొందనుందా.. అనే చర్చ జరుగుతోంది.