Site icon HashtagU Telugu

Nadendla Manohar: రైతు ఆత్మహత్యలను ‘జగన్ సర్కార్’ తొక్కిపెడుతోంది – ‘నాదెండ్ల మనోహర్’..!

12

12

సాగు నష్టాలు, అప్పుల వల్ల వచ్చిన ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కౌలు రైతుల వివరాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అందాల్సిన నష్టపరిహారాన్ని కూడా ఇవ్వకుండా వేధిస్తోందని అన్నారు. జీవో 43 అమలు తీరు దారుణంగా ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కనీసం గ్రామాల్లో పర్యటించిన పాపాన పోలేదని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పాలతోడు గ్రామంలో ఆర్ధిక ఇబ్బందులు, సాగు నష్టాలతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన పిల్లా రామకృష్ణ అనే కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ అన్నదాతల ఆత్మహత్యలు చాలా బాధాకరం. గ్రామస్థాయిలో వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖలు స్పందించే తీరు బాధిత కుటుంబాలకు ఉపయోగపడటం లేదు. పిల్లా రామకృష్ణ అనే కౌలు రైతు గత ఏడాది నవంబర్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడితే… ఇప్పటి వరకు ఆ కుటుంబానికి నష్టపరిహారం అందలేదు అని చెప్పారు నాదెండ్ల.

పాదయాత్ర హామీ ఏమైంది?:
జగన్ తన పాదయాత్ర సమయంలో అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చారు. నవరత్నాలు పేరు చెప్పి ఇంటింటికి తిరిగారు. ఎవరైనా కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ. 7 లక్షలు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ కాగితాలు లేవు.. ఈ కాగితాలు లేవని బాధిత కుటుంబాలను వేధించడం సబబు కాదు. ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం బయటకు పొక్కకుండా ఉంటే వైఎస్ఆర్ బీమా కింద రూ. 2 లక్షలు ఇస్తామని బాధిత కుటుంబాలపై ఒత్తిడి తీసుకురావడం బాధాకరం అని అన్నారు నాదెండ్ల మనోహర్.

47 మంది చనిపోతే 8 మందికే పరిహారం:
రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలపై జనసేన పార్టీ సమాచారం తెప్పించుకుంటుంది. దాదాపు తొమ్మిది జిల్లాల సమాచారం వచ్చింది. ముఖ్యంగా అన్నపూర్ణ వంటి గోదావరి జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు బాధించాయి. మాకు ఉన్న అధికారిక లెక్కల ప్రకారం జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 47 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం కేవలం 8 మందికే రూ. 7 లక్షల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. మిగతా వాళ్లు కాళ్లు అరిగేలా తిరిగినా అధికారులు స్పందించిన పాపాన పోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు లేవు. బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కి మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో నాయకులందరు కలిసి వినతిపత్రం సమర్పిస్తారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని” అన్నారు నాదెండ్ల మనోహర్.