ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యల సృష్టి కర్త ముఖ్యమంత్రి అని, ఏ ఒక్క సమస్య పరిష్కారం విషయంలోనూ ప్రజల కోసం ఆయన నిలబడింది లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి బాటలో పయనిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతూ తమ నియోజక వర్గాలను అభివృద్ధికి దూరం చేస్తున్నారన్నారు. మిమ్మల్ని ఎన్నుకున్నట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులను ప్రజలు ఎన్నుకున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రి అండతో దౌర్జన్యాలకు పాల్పడుతూ రెచ్చిపోయే విధానం ఎవ్వరికీ మంచిది కాదని హెచ్చరించారు. జనసైనికులను, వీర మహిళలను జనసేన తరఫున పోటీ చేసిన వారిని కావాలనే టార్గెట్ చేస్తున్నారన్నారు.
శనివారం భీమవరం నియోజకవర్గం పరిధిలోని మత్స్యపురి గ్రామంలో జనసేన నాయకుల, కార్యకర్తల సహకారంతో రూ. 14 లక్షలతో నిర్మించిన నూతన గృహాన్ని ప్రారంభించారు నాదెండ్ల మనోహర్. పంచాయితీ ఎన్నికల సందర్భంలో జనసేన పార్టీ మద్దతుదారుగా మత్స్యపురి గ్రామం 5వ వార్డు నుంచి విజయం సాధించిన చింతా అనంతలక్ష్మి పై వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడి ఆమె నివసించే పూరింటిని కూల్చివేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంతో ఆ మత్స్యకార కుటుంబం రోడ్డున పడగా జనసేన నాయకులు, జనసైనికులు అండగా నిలిచి డబుల్ బెడ్ రూం గృహాన్ని నిర్మించి ఇచ్చారు.
ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడవాలనే ప్రయత్నంలో ఓ శాసనసభ్యుడు ప్రజాస్యామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అగౌరవపరుస్తూ ఏ మాత్రం సహనం లేకుండా ప్రవర్తించారు. ప్రశాంతమైన ప్రాంతాల్లోనూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాత్రికి రాత్రి 200 మంది రౌడీలతో ఆనాడు జరిగిన సంఘటన మనందరినీ తీవ్రంగా బాధించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారు. ఓట్ల కోసం యువతను భయపెట్టి, కేసులు పెట్టి దౌర్జన్యాలకు గురిచేద్దామనే ప్రయత్నాలు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎక్కువయ్యాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో జిల్లాల్లో శాంతిభద్రతలు గాడి తప్పాయి.
సీఎం జగన్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే వైసీపీ నాయకులు కార్యకర్తలతో కొబ్బరి చెట్లు, బిల్డింగులకు మూడు రంగులు వేయడం ఆపించాలి. అభివృద్ధి చేయమనండి. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చినప్పుడు జనసైనికులంతా కలసి వచ్చి చాలా అద్భుతంగా స్పందించారు. ఎన్నికల్లో గెలిచామన్న ఆనందంలో ఒక పేద వ్యక్తి సంబరాలు చేసుకుంటుంటే మీరు చేసిన దౌర్జన్యాలు ఎవరూ మర్చిపోరు. చివరికి జనసైనికులు, పార్టీ నాయకులు, ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు నిలబడ్డారు. ఒక మార్పు కోసం మన నాయకుడు కష్టపడుతున్నాడు. ఆయన వెనుక అడుగడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్న తీరు అభినందనీయం అన్నారు నాదెండ్ల మనోహర్.
జనసేనపై ఎందుకంత కసి?:
ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దౌర్జన్యరీతిలో మనమూ చేయకూడదని నిర్ణయించుకుని ఒక సత్యాగ్రహ స్ఫూర్తితో , ఒక మంచి ఆలోచనతో రూ. 14 లక్షలతో ఆ మత్స్యకార కుటుంబాన్ని ఆదుకున్నారు. వాళ్లు ఏం తప్పు చేశారు. మా వాళ్ల మీద మీకు ఎందకంత కసి. వార్డు మెంబర్లుగా, సర్పంచుగా, ఎంపీటీసీగా గెలిచినందుకా వారంటే మీకంత కసి. మా జెడ్పీటీసీ మీద దౌర్జన్యం చేస్తున్నారున్నారు. కష్టకాలంలో మా లీగల్ విభాగం చక్కగా నిలబడింది. 34 మంది మీద కేసు పెడితే న్యాయ స్థానం కూడా ధర్మానికి అండగా నిలబడింది. సామాన్యులపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యలో ఉన్న విలువను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పోగొట్టుకున్నారు. ఆ సమయంలో జనసైనికులంతా నిలబడి జనసేన అంటే ఇది అని తెలిసేలా ఇల్లు నిర్మించిన ప్రతి జనసైనికుడికి, నిర్మాణానికి సహకరించిన ప్రతి దాతకు అభినందనలు తెలియచేస్తున్నాను. ఇలాంటి మార్పు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. యంత్రాంగాన్ని భయపెట్టి మరీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు ఇది మంచి పద్దతి కాదు. మిమ్మల్ని ఎన్నుకున్నట్టే స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్ధుల్ని ప్రజలు ఎన్నుకున్నారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసం మొదటి నుంచి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. జనసేన పార్టీ మొదటి రోజు నుంచి మత్స్యకారుల అభివద్ధి కోసం కంకణం కట్టుకుంది. జనసేన పార్టీ పోరాట యాత్రను సైతం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొదలు పెట్టారు. మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా గత 5 రోజులుగా తీర ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామాల్లో పర్యటించి జనసేన పార్టీ వారికి ఏ విధంగా అండగా నిలబడుతుంది అనే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. రేపు పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యల గురించి మాట్లాడేందుకు నరసాపురం వస్తున్నారు. బహిరంగ సభలో మత్స్యకారుల సమ్యల మీద మాట్లాడుతారు. సభను ప్రతి మత్స్యకారుడు తరలివచ్చి విజయవంతం చేయాలి. ఏ ఒక్క మత్స్యకారులు అధైర్యపడవద్దు. కులాలు, గ్రామాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి విభజించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఎవరూ అధైర్యపడవద్దు:
యువత రాజకీయాల్లోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఆదర్శంగా ముందుకు వెళ్లాలి. ఎవరూ అధైర్యపడవద్దు. మూడేళ్ల పాలనలో ఏం చేశారో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఒక్క యువకుడికి ఉద్యోగం ఇచ్చింది లేదు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా ప్రజల్ని దోచుకుంటున్నాయి. మనం నిజాయితీగా పని చేసి ప్రజలకు చేరువవుదాం. జనసేన పార్టీ మీతో ఉంటుందన్న నమ్మకం కలిగించడానికే పవన్ కళ్యాణ్ మమ్మల్ని పంపారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తప్పక విజయం సాధించి తీరుతుంద”న్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.