ప్రజలను పీడించి… వేధించి ఖజానా నింపుకోవాలనే అహంకారపూరిత నైజంతో సీఎం జగన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని విమర్శించారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. నిన్నమొన్నటి వరకూ ఓటీఎస్ పేరుతో పేదల ముక్కుపిండి డబ్బులు గుంజారు. ఇప్పుడు ఆస్తి పన్ను, కుళాయి పన్ను, చెత్త పన్నుల వసూలు విధానంలో పాలకులు ప్రజల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పడేస్తున్నాం కదా ప్రజలు మా దగ్గరపడి ఉండాల్సిందే అన్న నియంతృత్వ ధోరణే వైసీపీ ప్రభుత్వంలో కనిపిస్తోంది.
ఇదేనా వైసీపీ చెబుతున్న సంక్షేమ పాలన. జగన్ రెడ్డి తన అహంకారంతో ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమూ ఈ విధంగా ప్రజల గౌరవాన్ని కించపరచలేదు. పిఠాపురం మున్సిపాలిటీలో ఇంట్లో మహిళలు ఉండగానే అధికారులు ఇళ్లకు సీలు వేయడం అనేది అక్రమ గృహ నిర్బందమే అవుతుంది. ఆ కుటుంబ సభ్యుల పరువు ప్రతిష్టలను మంటగలిపేలా ప్రవర్తించారు. ఇది కచ్చితంగా క్రిమినల్ చర్య. ఇటువంటి దుశ్చర్యకు పాలకులను ప్రజలు నిలదీయాలి. ఆస్తి పన్ను వసూలు కోసం జప్తు వాహనాలు తిప్పుతూ పన్ను కట్టకపోతే ఇంట్లో సామానులు పట్టుకుపోతాం అని బ్యానర్లు కట్టుకొని తిరగడం వైసీపీ పాలకుల దోపిడీ మనస్తత్వాన్ని వెల్లడిస్తోంది.
ప్రజలు తాగు నీటికి అల్లాడుతుంటే కుళాయిలకు బిరడాలు వేసి వేధిస్తున్నారు. చెత్త పన్ను కట్టకపోతే చెత్తను తీసుకువచ్చి దుకాణాల ముందు, ఇళ్ల ముందు పోస్తున్నారు. ఈ వైఖరి పాలకుల వికృత మనస్తత్వాన్ని వెల్లడిస్తోంది. పన్ను కట్టకపోతే జప్తు చేసే అధికారం మున్సిపల్ అధికారులకు లేదు అని ప్రజలు గుర్తించాలి. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కలెక్టర్ ఆ ప్రక్రియ చేయాలి. అసలు రాష్ట్రంలోని కలెక్టరేట్లే ఆస్తి పన్ను కోట్ల రూపాయిలు బకాయిలుపడి ఉన్నాయి. ప్రజల ఆస్తులు జప్తు చేసే ముందు కలెక్టర్ కార్యాలయాలు జప్తు చేయాల్సి ఉంటుంది. అలాగే చెత్త లాంటివి ఇంటి ముందు పోస్తే వివిధ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు దాఖలు చేయవచ్చు. ప్రజల గౌరవమర్యాదలకు భంగం కలిగేలా ప్రభుత్వం చేసే చర్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలకు జనసేన అండగా ఉంటుందని అన్నారు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.