Chandrababu Naidu : హైటెక్ -హ్యుమానిటీ, అన్న‌మో చంద్ర‌బాబు!

హైటెక్ సీఎంగా చంద్రబాబుకు చెర‌గ‌ని ముద్ర ఉంది. అదే త‌ర‌హాలో రూ. 5ల‌కే అన్నం పెట్టిన మాన‌వీయ సీఎంగా పేరుంది.

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 04:00 PM IST

హైటెక్ సీఎంగా చంద్రబాబుకు చెర‌గ‌ని ముద్ర ఉంది. అదే త‌ర‌హాలో రూ. 5ల‌కే అన్నం పెట్టిన మాన‌వీయ సీఎంగా పేరుంది. అన్న క్యాంటిన్ల పేరుతో కేవ‌లం 5 రూపాయాల‌కు అన్నం పెట్టేలా ఏపీ వ్యాప్తంగా కేంద్రాల‌ను ఆనాడు ప్రారంభించారు. అంతేకాదు, తిరుమ‌ల ఆధ్యాత్మిక కేంద్రంలో ఉచితంగా మూడు పూజ‌లా ఆహారం అందించేలా మొబైల్ క్యాంటిన్ల‌ను ప‌రిచ‌యం చేసిన సీఎంగా చంద్ర‌బాబుకు పేరుంది. అన్నా క్యాంటిన్లను ప‌రిచ‌యం చేసి స‌రిగ్గా నాలుగేళ్లు అవుతోంది. ఆ సంద‌ర్భంగా టీడీపీ సోష‌ల్ మీడియా వేదిక ప‌లు పోస్టుల‌ను పెడుతోంది.

ప్ర‌జాద‌ర‌ణ పొందిన అన్న‌ క్యాంటీన్ల‌ను గుర్తు చేస్తూ టీడీపీ అధికారిక ట్విట్ట‌ర్ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. స‌రిగ్గా జూలై 11 2018లో టీడీపీ ప్ర‌భుత్వం ఏపీ వ్యాప్తంగా 35 ప‌ట్ట‌ణాల్లో 100 అన్నా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేసిందంటూ స‌ద‌రు ట్వీట్‌లో పేర్కొంది.ఆనాడు అన్నా క్యాంటీన్ల‌ను ప్రారంభిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఫొటోల‌ను కూడా ఆ పార్టీ త‌న ట్వీట్‌కు జ‌త చేసింది. ఈ ఫొటోల్లో చంద్ర‌బాబు అన్నా క్యాంటీన్‌లో స్వ‌యంగా ఆహారం తీసుకుని, పార్టీ నేత‌ల‌తో క‌లిసి భుజిస్తున్న చిత్రాలు ఉన్నాయి.

త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత తొలుత అమ్మ క్యాంటిన్ల‌ను పెట్టారు. ఆక‌లి బాధ‌తో పేద‌లు ఉండ‌కూడ‌ద‌ని ఆమె ప‌రిచ‌యం చేసిన క్యాంటిన్ల‌ను చంద్ర‌బాబు అధ్య‌య‌నం చేశారు. అదే త‌ర‌హాలో పెద్ద ఎత్తున ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటిన్ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉన్న‌త వ‌ర్గాలు కూడా క్యాంటిన్ల వ‌ద్ద ఆహారం కోసం నిల‌బడిన సంద‌ర్భాలు అనేకం. అక్ష‌య‌పాత్ర సంస్థ శుచి, శుభ్ర‌త‌తో కూడిన ఆహారాన్ని అందించేది. ప్ర‌భుత్వ ఉద్యోగుల నుంచి అనాధ‌ల వ‌ర‌కు క్యాంటిన్ల ద్వారా ఆక‌లి తీర్చుకునే వాళ్లు. అంత‌టి ప్రాచుర్యం పొందిన అన్న క్యాంటిన్లకు చంద్ర‌బాబు శ్రీకారం చుట్టి స‌రిగ్గా నాలుగేళ్లు.

ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే అన్నా క్యాంటిన్ల‌ను క్లోజ్ చేశారు. వాటిని తిరిగి ప్రారంభించాల‌ని కోరిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకోలేదు. మ‌రో పేరుతోనైనా క్యాంటిన్ల‌ను ప్రారంభించాల‌ని ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ కోరింది. కానీ, వాటిని మూసివేయ‌డంతో పాటు నిర్మాణాల‌ను కూడా కూల్చివేశారు. ఇటీవ‌ల కొన్ని చోట్ల అన్న క్యాంటిన్ల‌ను పార్టీ ప‌రంగా నిర్వ‌హించ‌డానికి టీడీపీ ముందుకొచ్చింది. అయిన‌ప్ప‌టికీ నిర్మాణాల‌ను ఏర్పాటు చేసుకునేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ అంగీకరించ‌లేదు. దీంతో ప్రైవేటు స్థ‌లాల్లో క్యాంటిన్ల‌ను టీడీపీ కొన్ని చోట్ల నిర్వ‌హిస్తోంది. పేద‌ల‌కు ఆక‌లి తీర్చే బృహ‌త్త‌ర ప‌థ‌కాన్ని సొంతంగానైనా కొన‌సాగించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. హైటెక్ సీఎం నుంచి మాన‌వీయ ముఖ్య‌మంత్రిగా పేరుతెచ్చిన అన్నా క్యాంటిన్ల‌ను ఎలాగైన కొన‌సాగించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న చంద్ర‌బాబు ఆశ‌యం ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో చూద్దాం.