Mylavaram TDP : మైల‌వ‌రం టీడీపీకి “ఇదేం ఖ‌ర్మ‌”

తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రిస్తూ "ఇదేం ఖ‌ర్మ" పేరుతో జ‌నంలోకి వెళ్తుంది. అయితే ఇదే స్లోగ‌న్ ఆ

  • Written By:
  • Updated On - December 6, 2022 / 07:26 PM IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రిస్తూ “ఇదేం ఖ‌ర్మ” పేరుతో జ‌నంలోకి వెళ్తుంది. అయితే ఇదే స్లోగ‌న్ ఆ పార్టీకి కూడా వ‌ర్తించేలా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప్ర‌ధానంగా ఎన్టీఆర్ జిల్లా మైల‌వ‌రం నియోజ‌కవ‌ర్గంలో టీడీపీకి ఇదేం ఖ‌ర్మ ప‌ట్టిందంటూ క్యాడ‌ర్‌లో చ‌ర్చ జరుగుతుంది. జిల్లా మొత్తం తానే శాసించేలా ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు ఇప్పుడు మైల‌వరంలో గ‌డ్డు ప‌రిస్థితి నెల‌కొంది. 2014లో మంత్రి అయిన దేవినేని ఉమా అధికారంలో ఉన్న‌ప్పుడు కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అధికారం పోయిన త‌రువాత కూడా అదే తీరు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని క్యాడ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఉమా గెలుపుకు కృషి చేసిన వారిని సైతం ప‌క్క‌న పెట్టార‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

ఉమా వ్య‌వ‌హార‌శైలి విసిగిపోయిన స్థానిక టీడీపీ నాయ‌కులు తిరుగుబాటు మొద‌లు పెట్టారు. స్థానికుల‌కే టికెట్ ఇవ్వాలంటూ లోక‌ల్ నినాదాన్ని తెర‌మీద‌కు తెచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మ‌సాని సుబ్బారావు.. మాజీ మంత్రి దేవినేని ఉమాపై తిరుగుబాటు చేస్తున్నారు. స్థానికుల‌కే టికెట్ ఇవ్వాల‌ని బొమ్మ‌సాని డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆత్మీయ స‌మావేశాల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో త‌న బ‌లం నిరూపించుకుంటున్న బొమ్మ‌సాని.. ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మాన్ని కూడా ప్రారంభించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా జిల్లాలో ఎవ‌రితో కూడా స‌ఖ్య‌త‌గా ఉండ‌ర‌ని క్యాడ‌ర్‌లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇటు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానితో దేవినేని ఉమా అంటిముంట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఉమా త‌న స్వార్థం కోసం వ‌ర్గ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం చూసుకోకుండా పక్క నియోజ‌క‌వ‌ర్గాల్లో పెత్త‌నం చెలాయిస్తున్నార‌ని క్యాడ‌ర్ చ‌ర్చించుకుంటుంది.

ఇదిఇలా ఉంటే మైల‌వ‌రం మాజీ ఎమ్మెల్యే జేష్ఠ్య ర‌మేష్ బాబు సైతం దేవినేని ఉమాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిన్నమొన్నటి వరకూ పార్టీలో నేను నెంబర్-2 అని విర్రవీగిన దేవినేని ఉమా నేడు అదేపార్టీలో మనుగడ కోసం పడరాని పాట్లు పడుతున్న తీరు రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే విషయమేన‌న్నారు. మైలవరం నియోజకవర్గంలో ఉమా వ్యక్తిగతంగానూ, పార్టీపరంగానూ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవటానికి ఆయన స్వయంకృతాపరాధమే కారణమ‌ని.. పార్టీలో నేనే మోనార్క్ నని విర్రవీగే ఎంతటివారికైనా పతనం తప్పదన్నారు. పార్టీని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించి, ఉన్నత పదవులను అనుభవిస్తూ తోటివారి ఎదుగుదలను జీర్ణించుకోలేక కుట్రలు, కుతంత్రాలతో తోటివారిని అణగదొక్కాలనుకునే రాబందులకు కాలమే పరిష్కారం చూపుతోంద‌ని మాజీ ఎమ్మెల్యే జేష్ట్య ర‌మేష్‌బాబు ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు.

1998-99 లో జిల్లాలో ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నేనే, నా నియోజకవర్గం అనే నినాదంతో అటు పార్టీ అభివృద్ధి, ఇటు నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తుంటే అన్నదమ్ములు ఇద్ద‌రు కలసి కుట్రలు, కుతంత్రాలు చేసి త‌న‌ను బలిచేసే ప్రయత్నాలు చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. అదేవిధంగా 2009 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గంపై కన్నేసి ఇక్కడి నుండి కొంతమంది తమ్ముళ్లను పిలిపించుకుని అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇప్పించి కోమటి సుధాకర్ ను బలిపశువును చేసింది నిజం కాదా..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. నిన్న, మొన్నటి వరకూ అసమ్మతి, అసంతృప్తి అంటే తెలియని ఉమాకు నేడు మైలవరం తమ్ముళ్లు పట్టపగలే చుక్కలు చూపుతున్న తీరు ఆయన రాజకీయ సమాధికి పరాకాష్ట అని వ‌ర్ణించారు. పార్టీని కూడా వీడి రాజకీయాలనుండి శాశ్వతంగా దూరం కావటం తప్ప ఉమాకు మరో మార్గం లేదని..లేనిపక్షంలో పార్టీలోని తెలుగు తమ్ముళ్లే ఉమాను తరిమికొట్టే పరిస్థితి దగ్గర్లోనే ఉందని మాజీ ఎమ్మెల్యే జేష్ట్య ర‌మేష్‌బాబు వ్యాఖ్య‌లు చేశారు. ఎది ఎమైనా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి తీరు సొంత‌పార్టీ నేత‌ల‌కే చిరాకు పుట్టించే విధంగా ఉంద‌ని జిల్లా టీడీపీలో చ‌ర్చ జ‌రుగుతుంది. మైల‌వ‌రం టీడీపీకి “ఇదేం ఖ‌ర్మ” అంటూ కార్య‌క‌ర్త‌లు చ‌ర్చించుకుంటున్నారు.