Srisailam: సుప్రీం తీర్పుపై హ‌ర్షం వ్య‌క్తం చేసిన ముస్లింలు…!

శ్రీశైలం ఆల‌యంలోని షాపుల్లో ఇత‌ర మ‌తాల వారు వేలంలో పాల్గొనకుండా నిషేధించ‌కూడ‌ద‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - December 19, 2021 / 11:45 AM IST

శ్రీశైలం ఆల‌యంలోని షాపుల్లో ఇత‌ర మ‌తాల వారు వేలంలో పాల్గొనకుండా నిషేధించ‌కూడ‌ద‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణ‌యంపై శ్రీశైలం ఆల‌య స‌ముదాయంలోని ముస్లిం దుకాణ‌దారులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.ఆల‌య ప్రాంగ‌ణంలో ఇప్ప‌టికే షాపులు లైసెన్సులు క‌లిగి ఉన్న ఇత‌ర మ‌తాల‌కు చెందిన వారు కూడా వేలంలో పాల్గొన‌వ‌చ్చ‌ని సుప్రీం తెలిపింది. ఆల‌యాల్లో ఇత‌ర మ‌తాల వాళ్లని భాగ‌స్వామ్యం చేయ‌డాన్ని హిందూ ధార్మిక సంస్థ‌లు త‌ప్పుబట్టాయి. దీంతో శ్రీశైలం ఆల‌య స‌ముదాయాల్లో షాపుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగష్టు 2019లో నిలిపివేసింది.

శ్రీశైలానికి చెందిన 21 మంది ముస్లిం దుకాణదారుల బృందం తో పాటు విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గా ఆల‌యంలో ఉన్న షాపు యాజ‌మాని దీనిపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ రెండు పిటిష‌న్ల‌ను విచారించిన ధ‌ర్మాసనం రెండు పిటిషన్లను కలిపి ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2017లో శ్రీశైలం ఆలయ పాలకవర్గం ఆలయానికి వెళ్లే రెండు ప్రధాన అప్రోచ్ రోడ్ల రహదారి విస్తరణ, సుందరీకరణను చేపట్టింది. రోడ్డు విస్తరణ కోసం రోడ్లకు ఇరువైపులా ఉన్న కనీసం 50 దుకాణాలను కూల్చివేయాలని, కొత్త షాపుల ఏర్పాటుకు స్థలం సమీపంలోనే కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో సదరు షాపు యజమానులందరి నుంచి రాత పూర్వకంగా సమ్మతి తీసుకుంది. ఈ 50 మంది దుకాణాల యజమానుల్లో 21 మంది ముస్లింలు ఉన్నారు.

షాపు యజమానులను మార్చడానికి, పునరావాసం కల్పించడానికి ఆలయ నిర్వాహకులు విశాలమైన శ్రీ లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఇక్కడ దుకాణాలను కేటాయించాలని శ్రీశైలం దేవస్థానం న్యాయ అధికారి ఎం రాజా తెలిపారు. అయితే, 2019 ఆగస్టులో దుకాణాల వేలం జరగాల్సి ఉండగా… ఏపీ ధార్మిక సంస్థ దేవాదాయ చట్టాన్ని ఉటంకిస్తూ…హిందూయేతరులు వేలంలో పాల్గొనడంపై భజరంగ్ దళ్ , స్థానిక బిజెపి సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలోని అనేక హిందూ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేలాన్ని నిలుపుదల చేసింది. వేలం నిలిపివేయ‌డాన్ని ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళ‌న నిర్వ‌హించారు. దీనికి ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లను ప్రారంభించింది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో)ని బదిలీ చేసి, రెండు రోజుల్లోనే కొత్త ఈఓని ఇక్క‌డ నియ‌మించ‌డంతో కొంత ఆందోళ‌న స‌ద్దుమ‌ణిగింది.

21 మంది దుకాణదారుల బృందం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.ద‌శాబ్ధాలుగా శ్రీశైలంలో నివసిస్తున్నందున తమ జీవించే హక్కును ఉల్లంఘించరాదని పేర్కొంటూ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కొత్త కాంప్లెక్స్‌లో వేలంపాటలో పాల్గొనేందుకు వెళ్లిన మహమ్మద్‌ రఫీ అనే దుకాణ‌దారుడిని వేలాన్ని నిరాకరించారు.దీంతో ఆయ‌న‌తో పాటు మరో 20 మంది ముస్లిం షాపు యజమానుల తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

త‌న తండ్రి అనంత‌పురం స‌మీపంలోని ఆత్మ‌కూర్ నుంచి వ‌చ్చి ఇక్క‌డ చిన్న దుకాణం పెట్టుకున్నార‌ని..తాను కూడా ఇక్క‌డే పుట్టి పెరిగిన దుకాణం న‌డుపుకుంటున్నాన‌ని ర‌ఫీ తెలిపారు.ఇక్క‌డ జీవ‌నోపాధి పొందే హ‌క్కు త‌న‌కు ఉంద‌ని…త‌మ‌ను మ‌తం ఆధారంగా బయటకు పంపించడం సరికాదన్నారు. తాము అందరిలాగే పూజా సామగ్రిని విక్రయిస్తాని ర‌ఫీ తెలిపారు. ఇక్క‌డ జీవించే హ‌క్కును పొంద‌డానికి తాము సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌ని…సుప్రీంకోర్టు ఆర్డ‌ర్ ని స్వాగ‌తిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

దేవాదాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ కమిషనర్‌, శ్రీశైలం దేవస్థానం ఈఓపై ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను అధికారులు ఉల్లంఘించారని పిటిష‌న‌ర్ త‌రుపు న్యాయ‌వాది వాదించారు. తాము శ్రీశైలంలో పుట్టి పెరిగామని..ఇప్పటికే దుకాణాలు ఉన్నందున శ్రీశైలం దేవస్థానం పాలకవర్గం దుకాణాల వేలం నుంచి తమను అడ్డుకోరాదని దుకాణదారుల పిటిషన్‌లో పేర్కొన్నారు.