ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సందర్భంగా ఉగ్రవాదులదాడిలో ప్రాణాలర్పించిన తెలుగు సైనికుడు మురళీ నాయక్ (Murali Nayak) భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు. కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న మురళీ నాయక్ ఉగ్రవాదుల దాడిని ఎదుర్కొని అసాధారణ ధైర్యంతో 14 మంది పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. తన తుపాకీతో బుల్లెట్ల వర్షం కురిపిస్తూ శత్రు బలగాలను ఎదుర్కొన్న మురళీ నాయక్, చివరికి మరో ఉగ్రవాది కాల్పుల్లో అమరుడయ్యాడు. “దేశం కోసం ప్రాణాలే కాదు, జీవం కూడా సమర్పిస్తాను” అన్న తత్వాన్ని జీవితంగా మార్చిన మురళీ నాయక్ దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
Operation Sindoor : అగ్నివీర్ చనిపోతే.. కేంద్రం ఎంత పరిహారం ఇస్తుందంటే..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండా గ్రామానికి చెందిన మురళీ నాయక్, మహారాష్ట్రలో ట్రైనింగ్ పూర్తి చేసిన అనంతరం, ఉత్తర భారతదేశంలోని అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో సేవలందించాడు. ఉగ్రవాద దాడిలో అసాధారణ శౌర్యం ప్రదర్శించిన ఈ వీరుడు అమరత్వం పొంది గ్రామస్తుల గుండెల్లో అమరుడిగా నిలిచాడు. కుటుంబ సభ్యులు మురళీ నాయక్ త్యాగాన్ని గర్వంగా గుర్తు చేసుకుంటూ, “మా బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించి పోయాడు, దీనికన్నా గొప్ప విషయం లేదు” అన్నారు.
మురళీ నాయక్ వీరత్వాన్ని కొనియాడుతూ రాష్ట్ర, దేశ నాయకులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. మంత్రి సవిత గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే గోరంట్ల మండలంలో మురళీ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన ధైర్యాన్ని భవిష్యత్ తరాలకు గుర్తుండేలా చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం బెంగళూరు నుంచి మృతదేహం గ్రామానికి రానుండగా, పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ అమర వీరుడికి యావత్ భారతదేశం నివాళులు అర్పిస్తోంది.