Site icon HashtagU Telugu

Cock Fight: జగన్ గారు.. కోడి పందాల‌కు అనుమ‌తి ఇవ్వండి!

Cock

Cock

కాపు ఉద్య‌మ‌నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఏపీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డికి లేఖ రాశారు. ఇప్ప‌టివ‌ర‌కు కాపుల స‌మ‌స్య‌ల‌పై లేఖ‌లు రాసిన ఆయ‌న ఈ సారి సంకాంత్రికి కోడి పందాల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులను లేఖ‌లో ఆయ‌న ప్రస్తావించారు. దాదాపు 5 రోజుల పాటు కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఇతర ఆటలు నిర్వహించి సంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి పండుగను జరుపుకోవడంపై చాలా సున్నితమైన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. 1978 నుంచి 2004 వరకు కోడిపందాల కోసం సాధారణంగా పోలీసు శాఖ నుంచి అనుమతి తీసుకుని సులువుగా పొందేవారని గుర్తు చేశారు. ఈ క్రీడలకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం సమస్య ఇబ్బందికరంగా మారిందని, సంక్రాంతి, ఉగాది పండుగలను 5 రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునేలా శాశ్వత ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆ పండుగల సమయంలో చాలా మందికి పని ఉండదని అందుకే ఉత్సవాల్లో పాల్గొంటారని ముద్రగడ అన్నారు. అంతేకాదు ఇవి జల్లికట్టు లాంటి ప్రమాదకరమైన ఆటలు, ఉత్సవాలు కావని స్పష్టం చేశారు. కోడిపందాల ముసుగులో ప్రజలను జైళ్లలో పెట్టవద్దని ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడిపందాలు, ఎద్దుల పందేలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం నిఘా పెట్టి కోడిపందాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. అయితే ఉత్సవాల్లో భాగంగా ప్రజలు ఆటలు నిర్వహిస్తారు.

Exit mobile version