Anil Kumar : నెల్లూరు జిల్లా అక్రమ మైనింగ్ వ్యవహారంపై తాజా కేసులు రాజకీయ వేడి పెంచుతున్నాయి. ఇటీవల జిల్లా వ్యాప్తంగా అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అప్రతిష్ట కలిగించే విధంగా తప్పుడు కేసులు పెట్టారని అనిల్ కుమార్ మండిపడ్డారు. నిజమైన నేరస్తులను వదిలిపెట్టి, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకుంటున్నారంటూ ఆయన విమర్శించారు.
Read Also: Jaishankar : మరోసారి యూరప్ దేశాలకు జైశంకర్ చీవాట్లు..!
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ విషయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. “ఇది చిన్న విషయం కాదు. వేమిరెడ్డి జవాబుదారిత్వం తీసుకోవాలి. ప్రశ్నలు ఎదుర్కొనకుండా తప్పించుకోలేరు ” అంటూ అనిల్ కుమార్ హెచ్చరించారు. అక్రమ మైనింగ్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ తమ పార్టీని టార్గెట్ చేస్తున్నారని, తాము ఎలాంటి అక్రమ కార్యకలాపాలలో పాల్గొనలేదని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. “అన్నీ దేవుడే చూస్తాడు. మాకు ఎలాంటి భయమూ లేదు. మేము ప్రజల పక్షాన నిలబడతాం,” అని వ్యాఖ్యానించారు.
ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా మరింత రెచ్చిపోతోందని అనిల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రభుత్వ మార్పుతో పాటు రెగ్యులర్ మైనింగ్ పనులు నిలిచిపోయాయి. వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార భాద్యతలు పట్టించుకోకుండా రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతున్నప్పటికీ, అధికార పక్షం దీనిపై ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. ఎంపీ వేమిరెడ్డి స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.