విశాఖ (Vizag) అంటేనే ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన మెట్రో సిటీ. విభజన తర్వాత విశాఖ మీదే అన్ని కేంద్రీకృతమయ్యాయి. ముఖ్యంగా భూముల విషయంలో ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. అయితే ఈ డిమాండ్‌ను రాజకీయంగా దుర్వినియోగం చేసుకుంటూ, భూములపై వివాదాలు తలెత్తించడం సహజంగా మారిపోయింది. ఇటీవల ఐటీ కంపెనీల పేరుతో భూములు అతి తక్కువ ధరలకు ఇవ్వబోతున్నారు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ (MP Bharath ) తీవ్ర స్థాయిలో స్పందించారు.
విశాఖలో భూములు ఎవరికీ అప్పనంగా ఇవ్వడం లేదని, ఐటీ హబ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తప్పుడు విమర్శలు చేయడం సరికాదని భరత్ అన్నారు. టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలను విశాఖకు తీసుకురావడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించగలమన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. టీసీఎస్ వచ్చిన తర్వాత మరిన్ని ఐటీ సంస్థలు విశాఖ వైపు మొగ్గుచూపుతాయని, దీని వల్ల నగర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
Ration Cards : రేషన్ కార్డుల తొలగింపుపై కేంద్రం సంచలన నిర్ణయం
భూములు తక్కువ ధరలకు ఇస్తున్నారనే వాదనను ఖండించిన భరత్, అసలు విషయం భూములు ఎంతకు ఇచ్చామన్నది కాదని, వాటి ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలే ముఖ్యమని అన్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లను తలదన్నేలా విశాఖను ఐటీ రంగంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వ యత్నాన్ని వైసీపీ నేతలు కావాలని తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యువతకు స్వదేశంలోనే ఉపాధి కల్పించే దిశగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలను తప్పుబట్టడం సరికాదన్నారు.
గతంలో వైసీపీ నేతలు చేసిన నిర్వాకం వల్లే ప్రజలు వారిని తిరస్కరించారని, అదే దోరణిలో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడుతుందని భరత్ హెచ్చరించారు. తమ హయాంలో విశాఖ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయకుండా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. వాస్తవాలను గ్రహించి రాజకీయ విమర్శలకంటే ప్రజల ప్రయోజనాలను ముందుకు పెట్టాలని వైసీపీ నేతలను ఆయన కోరారు.