Andhra Pradesh: : ఏపీలో ఏ సినిమా థియేటర్లో టిక్కెట్ రేటు ఎంతంటే…!

  • Written By:
  • Publish Date - February 18, 2022 / 10:12 AM IST

ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. థియేటర్లలో మూడు స్లాబుల్లో రేట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా టిక్కెట్ రేట్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం.. హోంశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన 13 మంది సభ్యులతో కమిటీ వేసింది. ఇప్పటికే పలుమార్లు ఈ కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. ఇప్పుడు లాస్ట్ మీటింగ్ కూడా అయిపోవడంతో అటు ప్రభుత్వానికి, ఇటు చిత్ర పరిశ్రమకు అనుకూలంగా ఉండే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

కమిటీ సమావేశాలు అయిపోయినందున టిక్కెట్ రేట్ల పంచాయితీ తీరినట్టే. కాకపోతే టిక్కెట్ ధరలు ఎంత మేర పెంచాలనేదే సమస్య. ఫిలిం ఛాంబర్స్ అసోసియేషన్ మాత్రం సినిమా టిక్కెట్ ధర కనీసం 40 రూపాయిలు ఉండేలా చూడాలని కోరింది. ఈమేరకు వారం, పదిరోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ఆదేశాలు జారీ చేసే ఛాన్సుంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీస ధర 40 రూపాయిలు, పట్టణాల్లో కనీస ధర 70 రూపాయిలుగా ఉండే అవకాశముంది.

ఈమధ్యకాలంలో టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు తీస్తుండడంతో వాటి బడ్జెట్ ఈజీగా వంద కోట్లు దాటేస్తోంది. అందుకే దానిని దృష్టిలో పెట్టుకుని 100 కోట్లు బడ్జెట్ దాటిన సినిమాల గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది. వాటికి ఐదో షో కేటాయింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ఈ విషయంలో చిన్న సినిమాలకు మాత్రం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

ఇక టిక్కెట్ల రేట్ల నిర్ణయంలో చాలా అంశాలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. థియేటర్లను ఏసీ, నాన్ ఏసీ, ఎయిర్ కూల్.. అంటూ వివిధ కేటగిరీలుగా వర్గీకరిస్తారు. పంచాయతీలు, నగరాల్లో జీఎస్టీ, విద్యుత్ ఖర్చులు ఒకేలా ఉంటే టిక్కెట్ రేటు ఒకలా ఉంటుంది. ఒకవేళ వాటి ఖర్చులో తేడా ఉంటే మాత్రం.. దానికి అనుగుణంగా టిక్కెట్ రేట్లలో మార్పు ఉంటుంది.

టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు… చిరంజీవి నేతృత్వంలో ఏపీ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను, నష్టాలను జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఏపీ ప్రభుత్వం.. పరిశ్రమ వినతి మేరకు.. టాలీవుడ్ కు, ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.