Site icon HashtagU Telugu

Motkupalli : జైల్లో చంద్రబాబుకు ఏమైనా అయితే జ‌గ‌న్ బాధ్య‌త వ‌హించాలి : మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

Motkupalli Narasimhulu

Motkupalli Narasimhulu

చంద్ర‌బాబు అరెస్ట్ పై తెలంగాణ సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు స్పందించారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్ ప్ర‌జాస్వామ్యానికి ముప్ప‌ని ఆయ‌న తెలిపారు. రెండు మూడు రోజుల్లో రాజమండ్రి వెళ్ళి భువనేశ్వరిని కలిసి పరామర్శిస్తానని తెలిపారు. అవకాశం ఉంటే జైల్లో చంద్రబాబు‌ను కూడ క‌లిసి త‌న మ‌ద్ద‌తు తెలుపుతాన‌ని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రేపు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని మోత్కుపల్లి ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌ని ఖండిస్తూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయ‌న నివాళ్లు అర్పించారు. ఇదే ఎన్టీఆర్ ఘాట్ నుంచి జగన్ గెలవాలని కోరుకున్నాన‌ని… త‌న‌ మాట ప్రకారం దళిత వర్గాలంతా ఏకమై జగన్ ను గెలిపించారని గుర్తు చేశారు.

గెలిచిన తరువాత జగన్ కు ఒకమైకం వచ్చిందని.. ఆ మైకంలో కన్నతల్లిని బయటకు పంపించాడని మోత్కుప‌ల్లి ఆరోపించారు. జగన్ కోసం పాదయాత్ర చేసిన చెల్లి షర్మిలను బయటకు గెంటేశాడు అంటూ మోత్కుపల్లి విమర్శించారు. జగన్ పరిపాలించే రాష్ట్రానికి రాజధాని లేదని.. రాజధాని లేని రాజ్యానికి నియంత జగన్ అని అన్నారు. ఒక్క అవకాశం ఇస్తే బాగా పాలన చేస్తాడని ప్రజలు నమ్మారని కానీ జగన్ కు పిచ్చి నెత్తికెక్కిందన్నారు. 74ఏళ్ల వ‌య‌స్సు ఉన్న పెద్ద మ‌నిషిని దేశంలో ఎంతో అనుభవం కలిగిన నేతను జైల్లో పెడతావా? అంటూ ప్ర‌శ్నించారు. చంద్రబాబును జైల్లో పెట్టి జగన్ రాక్షస ఆనందం పొందుతున్నాడని.. ఎఫ్‌ఐ‌ఆర్‌లో చంద్రబాబు పెరు లేదని.. గవర్నర్ అనుమతి తీసుకోకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా అరెస్ట్ చేశారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దోమలు కుడుతున్నాయని చంద్రబాబు జడ్జికి చెప్పారని. జైల్లో చంద్రబాబుకు ఏమైనా అయితే జ‌గ‌న్ మాత్రమే బాధ్యుడ‌ని మోత్కుప‌ల్లి అన్నారు.