CM Jagan – Vujicic : సీఎం జగన్‌పై నిక్ వుజిసిక్ ప్రశంసలు.. ఎవరీ వుజిసిక్ ?

CM Jagan - Vujicic : నిక్ వుజిసిక్.. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మోటివేషనల్ స్పీకర్.

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 07:42 AM IST

CM Jagan – Vujicic : నిక్ వుజిసిక్.. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మోటివేషనల్ స్పీకర్. ఈయన కాళ్లు చేతులు లేకుండా జన్మించినప్పటికీ, చిన్నప్పటినుంచి తనకున్న శారీరక , సామాజిక అవరోధాలను పక్కనపెట్టి మొక్కవోని దీక్షతో విభిన్న సామర్ధ్యాలను అందిపుచ్చుకున్నారు. ఈత కొట్టడం, సర్ఫింగ్ చేయడం, గోల్ఫ్ ఆడటం, నోట్లో పెన్ను పెట్టుకుని రాయడం, కాలివేలితో టైపింగ్ చేయడం వంటి సామర్థ్యాలు ఆయన సొంతం. వక్తగానూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. వుజిసిక్ చేసే మోటివేషనల్ స్పీచ్‌లు ఎంతోమందికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంటాయి. జీవితంపై ఆశను పెంచుతుంటాయి. తాజాగా ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వుజిసిక్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ సర్కారు అందిస్తున్న వివిధ పథకాల గురించి గొప్పగా చెప్పారు. సీఎం జగన్ తనతో పాటు ఎంతో మందికి ప్రేరణ ఇస్తున్నారని నిక్ వుజిసిక్(CM Jagan – Vujicic) వ్యాఖ్యానించారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘ముఖ్యమంత్రి జగన్ నాకు.. దేశంలోని ఎంతోమంది యువతకు ఆదర్శం’’ అని ఈ సందర్భంగా ఆయన  పేర్కొన్నారు. ‘‘విద్యారంగంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఆయన తన విజన్ తో బడులలో మౌలిక వసతులను కల్పించడంతోపాటు, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రమోట్ చేశారు’’ అని నిక్ వుజిసిక్ తెలిపారు.  సీఎం జగన్ చేసిన విద్యారంగ సంస్కరణలను ఈసందర్భంగా నిక్ వివరించారు. అమ్మ ఒడి లాంటి పథకాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యారంగంలో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ‘నాడు నేడు’ కార్యక్రమం ద్వారా జగన్ కృషి చేశారని నిక్ చెప్పారు. యువతను ఉద్దేశించి నిక్ మాట్లాడుతూ.. యువత తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చగలదన్నారు.  ‘‘మీ మనసులోకి ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి.. ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ తో ఉండండి.. విజయాలను ఆస్వాదించండి’’ అని తనదైన శైలిలో యువతను మోటివేట్ చేశారు. ‘‘ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బలంగా ఉండాలి. సాధించాలనే ఆశను ఎప్పుడు వదులుకోకూడదు. సహనంతో మీ కలలను నిజం చేసుకోవాలి’’ అని ఆయన యువతకు సందేశమిచ్చారు.

Also Read :Pakistan And Sri Lanka: శ్రీలంక, పాకిస్థాన్‌ల మ‌ధ్య వివాదం.. ఆసియా కప్ కార‌ణ‌మా..?