OTS scheme: ఐపోయిన పెళ్లికి జ‌గ‌న్ మేళం

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఒక‌లా..అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌రోలా వ్య‌వ‌హరించ‌డం రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. జ‌గ‌న‌న్న‌ భూ హ‌క్కు ప‌థ‌కం( ఓటీఎస్)కు ఎవ‌రూ స‌హ‌కారం ఇవ్వొద్ద‌ని చంద్ర‌బాబు ఇప్పుడు పిలుపునిస్తున్నాడు.

  • Written By:
  • Updated On - January 8, 2022 / 09:08 PM IST

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఒక‌లా..అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌రోలా వ్య‌వ‌హరించ‌డం రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. జ‌గ‌న‌న్న‌ భూ హ‌క్కు ప‌థ‌కం( ఓటీఎస్)కు ఎవ‌రూ స‌హ‌కారం ఇవ్వొద్ద‌ని చంద్ర‌బాబు ఇప్పుడు పిలుపునిస్తున్నాడు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇళ్ల పట్టాల రిజిస్ట్రేష‌న్ ఉచితంగా చేస్తాన‌ని ఆయ‌న హామీ ఇస్తున్నాడు. ఇలాంటి హామీని ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చాడు. ప‌క్కా గృహాల రుణాల వాయిదాల‌ను ఎవ‌రూ క‌ట్టొద్ద‌ని ఆనాడు జ‌గ‌న్ పిలుపునిచ్చాడు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రుణాల‌న్నింటినీ ర‌ద్దు చేస్తాన‌ని హామీ ఇచ్చాడు. ఆ మేర‌కు చ‌ర్య‌లు తీసుకున్న జ‌గ‌న్ ఇప్పుడు ఓటీఎస్ అంటూ వేల కోట్ల‌ను నిరుపేద‌ల నుంచి వ‌సూలు చేయ‌డానికి సిద్ధప‌డ్డాడు. ఏపీ ప్ర‌భుత్వం 2011 ఆగస్టు 15 కంటే ముందు ఇచ్చిన నివాస పత్రాలు, డీఫామ్ పట్టాల కింద ఇళ్లు కట్టుకున్న వాళ్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఆ మేర‌కు జ‌గ‌న్ సర్కార్ జీవోను ఇచ్చింది.

గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌ పరిధిలో రూ.20 వేలు చొప్పున ఏకకాలంలో ప్రభుత్వానికి చెల్లించాల‌ని ఆ జీవో సారాంశం. అందుకోసం ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994ను కూడా సవరణ చేసింది. ఓటీఎస్ కింద మొత్తం 56,69,000 మంది అర్హులున్నారని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చెబుతోంది. అంటే, దాదాపు కోటిన్న‌ర మంది నిరుపేద‌ల నుంచి రిజిస్ట్రేష‌న్ రూపంలో డ‌బ్బు వ‌సూలు చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ మాస్ట‌ర్ ప్లాన్ వేసింద‌న్న‌మాట‌. డీకే పట్టాలు, నివాస ప‌త్రాలు పొందిన నిరుపేద‌లు ప‌క్కా గృహాల్లో కొన్ని ద‌శాబ్దాలుగా నివ‌సిస్తున్నారు. సొంత ఇళ్లు మాదిరిగానే వాళ్లు భావిస్తున్నారు. రోడ్డు, కరెంట్‌, నీటి సౌక‌ర్యాలను ఇచ్చినందుకు చార్జిల‌ను చెల్లిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ సొంత ఇంటి క‌ల నెర‌వేరాలంటే రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ చెబుతోంది. వైసీపీ సానుభూతిప‌రులు కొంద‌రు పార్టీ ప‌రంగా రిజిస్ట్రేష‌న్ల‌కు ముందుకు వ‌స్తున్నారు. మ‌రికొంద‌రు ఇదేం చోద్యం అంటూ దూరంగా ఉంటున్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అంద‌రికీ ఉచిత రిజిస్ట్రేష‌న్ చేస్తామ‌ని చెబుతోన్న చంద్ర‌బాబు ప‌రోక్షంగా అందుకు మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నాడు.

రైతు, డ్వాక్రా రుణాల‌న్నింటినీ మాఫీ చేస్తాన‌ని 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప్రామిస్ చేశాడు. ఆ త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కోట‌య్య క‌మిటీని ఏర్పాటు చేసి రైతు రుణ మాఫీని కొంత మేర‌కు మాత్ర‌మే బాబు చేయ‌గ‌లిగాడు. ఇక డ్వాక్రా రుణాల‌ను కూడా పూర్తిగా మాఫీ చేయ‌లేక‌పోయాడు. ఆగ్ర‌హంతో ఉన్న మ‌హిళ‌ల్ని అనుకూలంగా తీసుకొచ్చుకునేందుకు 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా పోస్ట్ డేట్ చెక్ ల‌ను పసుపుకుంకుమ కింద ఆనాడు బాబు స‌ర్కార్ పంపిణీ చేసింది. సీన్ క‌ట్ చేస్తే టీడీపీ అధికారం కోల్పోయింది.
సేమ్ టూ సేమ్ చంద్ర‌బాబు మాదిరిగా డ్వాక్రా, ప‌క్కా గృహ రుణాలన్నింటినీ ర‌ద్దు చేస్తాన‌ని 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చాడు. కానీ, రుణాల మాఫీపై ప్లేట్ మార్చేశాడని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక ప‌క్కా గృహాల రుణాల‌ను ర‌ద్దు చేస్తాన‌ని, ఇప్పుడు రిజిస్ట్రేష‌న్ల రూపంలో నిరుపేద‌ల నుంచి వేల కోట్లు వ‌సూలు చేయ‌డానికి సిద్ధం అయ్యాడు. నిరుద్యోగభృతి గురించి జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రిచిపోయింది. రైతు భ‌రోసా కింద ఇచ్చే డ‌బ్బును ప‌లు ర‌కాల కార‌ణాలు చూపుతూ ఆపేస్తున్నారు. ఇక పెన్ష‌న్ల‌ను క‌ట్ చేయ‌డానికి ఇంటింటి స‌ర్వేను చేసుకుని అమ‌లు చేస్తున్నాడు. హామీల‌న్నింటినీ అమ‌లు చేయ‌డానికి రాష్ట్ర బ‌డ్జెట్ స‌రిపోవ‌డంలేదు. సుమారు 7ల‌క్ష‌ల అప్పుతో ఉన్న ఏపీ రాష్ట్రాన్ని దాదాపుగా దివాలా తీయించాడ‌ని ప్ర‌తిప‌క్షంగా ఆరోపిస్తోంది. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లోని చెత్త మీద ప‌న్నులు వ‌సూలు చేయ‌డం చాలా కాలంగా చూస్తున్నాం. ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలో గ్రామాల్లోని చెత్త‌పైన ప‌న్నులు వేస్తున్నారు. నిరుపేద‌లు ఎక్కువ‌గా ఉండే గ్రామాల‌ను కూడా వ‌ద‌ల‌కుండా వేల కోట్లు వ‌సూలు చేయ‌డానికి ఏపీ స‌ర్కార్ వెనుకావ‌డ‌డంలేదు.

ఇప్పుడు ఓటీఎస్ పేరుతో ఇళ్ల‌కు రిజిస్ట్రేష‌న్లు చేయించుకోవాల‌ని ఒత్తిడి చేస్తోంది. అదేమంటే, నిరుపేద‌ల‌కు మేలు చేయ‌డానికి రిజిస్ట్రేష‌న్లు పెట్టామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. కొన్ని ద‌శాబ్దాలుగా ఇచ్చిన ప‌క్కా గృహాల‌కు ఇప్పుడు రిజిస్ట్రేష‌న్ చార్జీలు వ‌సూలు చేయ‌డాన్ని ప్ర‌తిప‌క్షం త‌ప్పుబ‌డుతోంది. ఏపీ ప్ర‌భుత్వం ఇస్తోన్న ఉచితాల‌పై విప‌క్షాలు బాహాటంగా విమ‌ర్శించ‌డానికి ధైర్యం చేయ‌లేక‌పోతున్నాయి. కానీ, లోలోన మాత్రం ఉచితాల క్ర‌మంలో ఏపీ రాష్ట్రం దివాళా తీసింద‌ని విమ‌ర్శిస్తున్నారు. అదే స‌మ‌యంలో అధికారంలోకి వ‌స్తే ఓటీఎస్ ను ఉచితంగా చేస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇస్తున్నారు. మొత్తం మీద అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక ర‌కంగా ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌రో విధంగా నేత‌లు హామీలు ఇవ్వ‌డం మామూలు అయింది. ఫ‌లితంగా ఏపీరాష్ట్రం ఆర్థికంగా రివ‌ర్స్ లో వెళుతోంది.