తూర్పు తీరంలో ఏర్పడిన సైక్లోన్ మోంథా ప్రభావం నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా పరిపాలన యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉంది. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు, గంటకు 90–110 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందర్ ప్రసాద్ ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరారు. అవసరం తప్ప ఎవరూ ఇళ్లను విడిచి బయటకు రాకూడదని, గాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగ్స్ సమీపంలో నిలబడరాదని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా, ఇప్పటికే వెళ్ళినవారు వెంటనే తీరానికి చేరుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో పంటలకు నష్టం జరగకుండా రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. తుఫాన్ తీవ్రత అధికంగా ఉండే పల్లపు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాల్లో, నది తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
Jigris : ‘జిగ్రీస్’ విడుదల తేదీ ఫిక్స్
తుఫాను ప్రభావంతో విశాఖలోని బీచ్‌లను తాత్కాలికంగా మూసివేశారు. సముద్రంలో భారీ అలల ఉధృతి, గాలుల వేగం పెరగడంతో సముద్రతీరాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ సమయంలో స్నానం చేయడం, సముద్ర తీరానికి వెళ్లడం ప్రమాదకరమని పోలీసులు తెలిపారు. పోలీసులు నగర ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, బీచ్ ప్రాంతాలలో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ముఖ్యంగా ఆర్కే బీచ్, ఋషికొండ, సాగర్ నగర్ వంటి పర్యాటక బీచ్‌లను పర్యాటకుల కోసం తాత్కాలికంగా మూసివేశారు. తుఫాన్ ప్రభావం తగ్గేవరకు తీరప్రాంతాలకు రాకూడదని ప్రజలకు కఠినంగా హెచ్చరికలు జారీ చేశారు. స్థానికులు, సందర్శకులు అందరూ ఇంట్లో సురక్షితంగా ఉండాలని, అవసరమైతే అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
అత్యవసర పరిస్థితుల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల వర్షాల తీవ్రత, గాలుల నష్టం లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే సమాచారం అందించే విధంగా రెండు హెల్ప్‌లైన్ నంబరులు అందుబాటులో ఉంచారు. ప్రజలు 0891-2590102 లేదా 0891-2590100 నంబర్లకు కాల్ చేసి సహాయం కోరవచ్చని కలెక్టర్ తెలిపారు. తుఫాన్ సమయంలో భద్రతా సిబ్బంది, రెవెన్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ప్రాణభద్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. మొత్తం మీద, మోంథా సైక్లోన్ ప్రభావం సమయానికి జిల్లా యంత్రాంగం సకాలంలో చర్యలు తీసుకోవడం విశాఖలోని ప్రజల్లో కొంత భరోసా కలిగించింది.
