Site icon HashtagU Telugu

AP CMO: ఇదేందీ..అయ్యా యెస్

Jagan Praveen Prakash

Jagan Praveen Prakash

ఒక ఫోటో…అనేక భావాలకు సమాధానం ఇస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఏపీ సీఎం జగన్, సీఎంవో ప్రధాన కారదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూస్తే ప్రవీణ్ ప్రకాష్ విశ్వాసానికి ఒక నిదర్శనం. ఇక నమ్మినబంటు అనలేంగాని ఆ తరహా భావన కలిగేలా జగన్ కుర్చీ వద్ద మోకాళ్లపై కూర్చొని ప్రవీణ్ అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రిపబ్లిక్ డే సందర్బంగా సీఎం కూర్చొన్న వద్దకు అధికారులు వస్తూ పోతూ ఉండటం కనిపించింది. సాధారణంగా ఏదయినా సమాచారం ఇవ్వడానికి అధికారులు రావడం సహజం. ఆ తరహాలోనే ప్రవీణ్ ప్రకాష్ రిపబ్లిక్ డే రోజున సీఎం కుర్చీ వద్దకు వచ్చాడు. ఆయనకు ఏదో చెప్పే ప్రయత్నంలో మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అలా కొద్ది సేపు కూర్చొని సీఎంకు ఏదో వివరించాడు. సరిగ్గా అదే సమయంలో ఫోటోలు క్లిక్ మన్నాయి. ఇంకేముంది ఒక ఐఎఎస్ ఈ విధంగా మోకాళ్ల పై కూర్చొని జగన్ కు సమాచారం ఇవ్వడం ఏంటి? అనే ప్రశ్న సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఆ ఫోటో వైరల్ అవుతుంది.

సరిగ్గా ఇలాంటి సీన్ తెలంగాణ ఐఎఎస్ వెంకట్రామిరెడ్డి విషయంలోనూ కనిపించింది. నెల తిరగకుండానే టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యాడు. ఇదే ప్రశ్న ప్రవీణ్ విషయంలోనూ వస్తుంది.వాస్తవంగా ప్రవీణ్ ప్రకాష్ చాలా ముక్కు సూటి అధికారి. ఎక్కడ బెండు అయ్యే అధికారి కాదు. ఆయన కెరీర్ కేస్ స్టడీ చేస్తే చాలా సంచలన విషయాలు ఉన్నాయి. వాటిలో గుంటూరు మేయర్ చుక్కా ఏసురత్నం ను 1999లో అరెస్ట్ చేయించాడు. ఆరోజున ఆక్రమణల తొలగింపుపై అడ్డు వస్తున్నాడని అరెస్ట్ చేయించాడు. అప్పట్లో మంత్రిగా ఉన్న కోడెల శివప్రసాద్ ను కూడా లెక్క పెట్టలేదు. ఆ సమయంలో గుంటూరు కమిషనర్ గా ప్రవీణ్ ప్రకాష్ ఉన్నాడు. ఇక అందరూ కలిసి అక్కడ నుంచి విజయవాడ కమిషనర్ గా బదిలీ చేయించారు. అక్కడ కూడా వెనక్కు తగ్గకుండా ఆక్రమణల పై కొరడా జులిపించాడు. అక్కడ అవినీతి మార్క్ లేకుండా ఆయన కెరీర్ ఉంది. ఆ తరువాత విశాఖ జాయింట్ కలెక్టర్ గా చేసాడు. అప్పట్లో విశాఖ భూముల ఆక్రమణల ను బయటకు తీసాడు. అక్కడ పొలిటికల్ లీడర్ లకు నిద్రలేకుండా చేసాడు. దీంతో ఢిల్లీలో ని ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్ గా టీడీపీ హయంలో బదలీ పై వెళ్ళాడు.

సీఎం గా జగన్ భాద్యతలు తీసుకున్న తరువాత సీఎంవోలోకి వచ్చాడు. ఆయన కెరీర్ ను చూసి జగన్ కీలక భాద్యతలు అప్పగించాడు. చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి కూడా ప్రవీణ్ కారణం అని అప్పట్లో బయటకు వచ్చింది. ఆ తరువాత ఆయన అనుకున్న విధంగా జగన్ కు సలహాలు ఇస్తూ సీఎం కార్యాలయం ను నడిపిస్తున్న ఐఎఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. జగన్ నమ్మిన అధికారిగా ప్రవీణ్ కేంద్ర, రాష్ట్ర సంబంధాలను చూస్తున్నాడు. విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించే పనిలో ఉన్నాడు. అన్ని రకాలుగా ఢిల్లీ లాబీయింగ్ నడుపుతున్నారు. అందుకే ఆయనకు జగన్ ప్రాధాన్యం ఇస్తాడు. ఇద్దరి మధ్యా బాగా బాండింగ్ ఉంది. ఆ క్రమంలో రిపబ్లిక్ డే రోజు మోకాళ్లపై కూర్చొని ప్రవీణ్ సబ్జెక్ట్ వివరిస్తున్నాడా? లేక యాదృచ్చికంగా అలా జరిగిందా? అనేది పక్కన పెట్టి ఆలోచిస్తే..ఐఏఎస్ లకు ఇదో అవమానకర సన్నివేశంగా సోషల్ సోషల్ మీడియా ఆడుకుంటుంది. నెటీజన్లకు పండుగ లాగా ఆ ఫోటో దొరికింది. దీనికి కౌంటర్ ప్రభుత్వం ఏమి ఇస్తుందో..చూద్దాం.!