Site icon HashtagU Telugu

MLC Anantha Bhaskar : డ్రైవ‌ర్ హ‌త్య‌ను అంగీక‌రించిన వైసీపీ ఎమ్మెల్సీ

Ysrc Mlc Ananta Uday Bhaskar

Ysrc Mlc Ananta Uday Bhaskar

డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యంను హ‌త్య చేసిన‌ట్టు వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు అంగీక‌రించారు. వ్య‌క్తిగ‌త విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డం కార‌ణంగానే సుబ్ర‌మ‌ణ్యంను హ‌త్య చేసిన‌ట్టు పోలీసుల వ‌ద్ద ఒప్పుకున్నారు. తానొక్క‌డినే డ్రైవ‌ర్ ను హ‌త్య చేసిన‌ట్టు చెబుతున్నాడు. ప్ర‌స్తుతం పోలీసులు అదుపులో ఉన్న అనంత్ బాబు ప‌లు విష‌యాల‌పై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. విచార‌ణ కొన‌సాగుతోంది. సాయంత్రం ఆయ‌న్ను అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్ర‌వేశ‌పెట్ట‌డానికి పోలీసులు సిద్ధ‌ప‌డుతున్నారు.

డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్య‌ను వైసీపీ ఎమ్మెల్సీ హ‌త్య చేయ‌డం ఏపీ రాజ‌కీయాలను వేడిక్కించింది. మూడు రోజుల క్రితం హ‌త్యా సంఘ‌ట‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయిన‌ప్పటికీ పోలీసులు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించారు. నేరుగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నుంచి ఆదేశం వ‌చ్చిన త‌రువాత పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. హంత‌కుడు అనంత్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్ మార్టం సంద‌ర్భంగా సుబ్ర‌మ‌ణ్యం కుటుంబీకుల‌ను అనంత్ బాబు బెదిరించాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ సంద‌ర్భంగా విప‌క్ష పార్టీలు సుబ్ర‌మ‌ణ్యం కుటుంబానికి అండ‌గా నిలిచాయి. మ‌రో వైపు ద‌ళిత సంఘాలు అనంత్ బాబు అరెస్ట్ ను డిమాండ్ చేస్తూ గ‌త రెండు రోజులుగా ఆందోళ‌న చేస్తున్నాయి. ఫ‌లితంగా ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెరిగింది.

లా అండ్ ఆర్డ‌ర్ విష‌యంలో ఏ మాత్రం రాజీప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన ఆదేశం మేర‌కు ఏపీ పోలీసులు సీరియ‌స్ గా అనంత్ బాబు కేసును తీసుకున్నారు. వేగ‌వంతంగా విచార‌ణ చేప‌ట్ట‌డం ద్వారా డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం హ‌త్య కేసును ఛేదించ‌గ‌లిగారు. హ‌త్య‌కు దారితీసిన అంశాల‌ను వెలుగులోకి రావాల్సి ఉంది. వ్య‌క్తిగ‌త విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డంతో హ‌త్య చేశాన‌ని అనంత్ బాబు చెబుతున్నారు. ఆ విష‌యాల‌న్నీ పోలీసులు ర‌హ‌స్యంగా ఉంచుతారా? లేక బ‌య‌ట పెడ‌తారా? అనేది ఆస‌క్తిక‌ర అంశం.