Tadipatri Politics: జేసీ బ్ర‌ద‌ర్‌కు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంట‌ర్..!

  • Written By:
  • Publish Date - March 31, 2022 / 02:24 PM IST

ఆంధ్ర‌ప్రదేశ్‌లోని తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి , మ‌రోవైపు మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య రగడ కొనసాగుతుంది. తాడిప‌త్రిలో స్థానికంగా పట్టు కోసం నువ్వా నేనా అన్నట్టు ఈ ఇద్ద‌రు నేతలు సై అంటే సై అనేలా పోటీపడుతున్నారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య మాట‌ల యుధ్ధం తీవ్ర‌స్థాయికి చేరుకుంటుంది.

మున్సిపల్ చైర్మన్ హోదాలో మున్సిపాలిటీలో పట్టు కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి శతవిధాలా ప్రయత్నం చేస్తుంటే, జెసి ప్రభాకర్ రెడ్డికి చెక్ పెట్టడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య మున్సిపల్ సిబ్బంది నలిగిపోతున్నారు. కావాలని ఇద్దరు పోటాపోటీగా కార్యక్రమాలను పెడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారని సమాచారం. ఈ ఇద్దరి ఆధిపత్య పోరులో తాము నలిగిపోతున్నామని మున్సిపల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక మ‌రో మ్యాట‌ర్ ఏంటంటే.. తాడిప‌త్రిలో అక్ర‌మ నిర్మాణాల మీద అక్క‌డ పెద్ద ర‌చ్చ జ‌ర‌గుతుంది. ఈ అంశం పై ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ, తాడిపత్రిలో అక్ర‌మ నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని, అధికార పార్టీ అండ‌తో తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మ నిర్మాణాలు జ‌రుగుతున్నాయని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్యాఖ్య‌లు చేశారు. అయితే జేసీ బ్ర‌ద‌ర్ వ్యాఖ్య‌ల‌పై తాజాగా అక్క‌డి అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు.

తాడిప‌త్రిలో అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో మున్సిపల్ ఛైర్మన్‌గా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి జాబితాను సిద్ధం చేయాలని, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోరారు. అక్ర‌మ నిర్మాణాల కూల్చివేతకు తాను కూడా వెళ‌తాన‌ని, ఈ క్ర‌మంలో జేసీ ప్రభాకర్ రెడ్డితో కలసి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న అక్రమ నిర్మాణాల‌ను కూల్చివేతకు వస్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పారు. దానికి ముహుర్తం కూడా ఫిక్స్ చ‌స్తూ.. ఉగాది పండగ తర్వాత అక్ర‌మ నిర్మాణాల కూల్చివేతను పెట్టుకుందామని, అయితే ఈలోపు మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వాటిని గుర్తించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోరారు. మ‌రి కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్య‌ల‌కు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.