Site icon HashtagU Telugu

Andhra Pradesh : పోలవరం మండలాల్లో వరద బీభత్సం.. ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే ధ‌న‌ల‌క్ష్మీ ప‌ర్య‌ట‌న‌

పోలవరం మండలాల్లో వరద బీభ‌త్సం సృష్టించింది. వ‌ర‌ద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో వీఆర్‌పురం మండలం శ్రీరామగిరి గ్రామంలో సీపీఎం నాయకులు పడవలో వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులకు ఇంటికి 5 లీటర్ల కిరోసిన్ ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం సత్యనారాయణ డిమాండ్ చేశారు. కూరగాయలు, బియ్యం, టార్పాలిన్లు కూడా ఇవ్వాలని కోరారు. ఇటు కూనవరం, వీఆర్ పురం మండలాల్లో ముంపునకు గురైన గ్రామాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పర్యటించి బాధితులను పరామర్శించారు. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ అనంతబాబు కోరారు. పునరావాస కేంద్రాలకు తరలించాలని, రెస్క్యూ సెంటర్లలో వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. విఆర్ పురం మండలం వడ్డిగూడెం గ్రామం వరద నీటిలో చిక్కుకోవడంతో గ్రామస్తుల పరిస్థితి దయనీయంగా మారింది. బోట్లు అందుబాటులో లేకపోవడంతో నిత్యావసర సరుకులు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది. కూనవరం మండలం టేకుబాక గ్రామంలో సబ్ కలెక్టర్ శుభం బన్సల్ పర్యటించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు.