తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede)లో మరణించిన వారి కుటుంబాలను మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి పరామర్శించారు. రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి ఘటనపై ఆరాతీశారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా మరికాసేపట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శిస్తారు.
తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక
తిరుపతి టికెట్ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అధికారుల నుంచి సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు నివేదిక అందింది. ఈ నివేదిక(Report)లో ఘటనకు సంబంధించిన వివరాలను, కారకాలను స్పష్టంగా చర్చించారు. ముఖ్యంగా పోలీసు అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని నివేదికలో ప్రస్తావించారు. ఘటన సమయంలో డీఎస్పీ అత్యుత్సాహంగా వ్యవహరించి, ఒక్కసారిగా భక్తులను కౌంటర్ వద్దకు రప్పించారని నివేదిక పేర్కొంది. అంత పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేసారి చేరడం వల్ల తొక్కిసలాట ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి ఘర్షణాత్మకంగా మారినప్పటికీ, డీఎస్పీ సకాలంలో స్పందించలేదని నివేదికలో పేర్కొన్నారు.
అలాగే అంబులెన్స్ డ్రైవర్ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. టికెట్ కౌంటర్ బయట అంబులెన్స్‌ను పార్క్ చేసి డ్రైవర్ అక్కడినుంచి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. తొక్కిసలాట జరిగిన తర్వాత 20 నిమిషాల పాటు అతను అందుబాటులోకి రాలేదని నివేదికలో పేర్కొన్నారు. ఇక నివేదికలో వెల్లడైన వివరాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కర్నూలు జిల్లా పవన్, లోకేశ్ పర్యటనలు రద్దు
తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కర్నూలు జిల్లా పర్యటన రద్దు చేసుకున్నారు. గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ పరిశీలించాల్సి ఉంది. అలాగే అనివార్య కారణాల వల్ల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కర్నూలు పర్యటన కూడా రద్దైనట్లు అధికారులు తెలిపారు. లోకేశ్ ఈరోజు కర్నూలులో పలు కళాశాలల సందర్శనతోపాటు మంత్రి భరత్ కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. కాకపోతే తిరుపతి ఘటన నేపథ్యంలో తన పర్యటన ను రద్దు చేసుకున్నట్లు సమాచారం.