Maha Shivratri : శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ఏపీ ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి తొలుత దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో బాపిరెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వైభవంగా జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు pic.twitter.com/T4AAVqvWkt
— I & PR Andhra Pradesh (@IPR_AP) February 25, 2025
Read Also: AP MLC Polls: ఏపీ ఎమ్మెల్సీ పోల్స్.. ప్రధాన పోటీ ఈ అభ్యర్థుల మధ్యే
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి ఆలయం దేశవ్యాప్తంగా శివ భక్తులకు ఆధ్యాత్మికంగా కీలక కేంద్రంగా వుందని, ప్రభుత్వం తరఫున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. భక్తుల మనోభావాలను కాపాడటానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనార్థం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు.
మరోవైపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక, ఏపీ, తెలంగాణలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహాశివరాత్రి కోసం ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పర్వదినం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా భారీగానే ఏర్పాట్లు చేశారు.
Read Also: KTR : టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల సహాయం కంటే ఢిల్లీ యాత్ర ముఖ్యమా..?