AP : ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా లక్ష్యాల్లో భాగంగా, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తీసుకున్న చర్యలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 31లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల ప్రక్రియను పూర్తిచేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈ రోజు అమరావతి సచివాలయంలో మంత్రుల బృందం తొలి సమావేశం జరిగింది. జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల అంశంపై కీలకంగా చర్చించిన ఈ సమావేశానికి అనగాని సత్యప్రసాద్ తో పాటు మంత్రులు పి. నారాయణ, వంగలపూడి అనిత, బి.సి. జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ హాజరయ్యారు. సమావేశంలో వివిధ మార్పులపై సమగ్రమైన విధానాన్ని రూపొందించేందుకు నిర్ణయాలు తీసుకున్నారు.
సెప్టెంబర్ 15వ తేదీ నాటికి జిల్లాల, మండలాల, గ్రామాల పేర్లు, సరిహద్దులపై తుది నివేదికను సమర్పించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో మంత్రుల బృందం పర్యటించనుంది. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల నుండి వినతులు స్వీకరించడానికి ఈ పర్యటనలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ అభిప్రాయాలు, అభ్యర్థనలు సంబంధిత జిల్లా కలెక్టర్లకు సెప్టెంబర్ 2వ తేదీ లోపు పంపించవచ్చని మంత్రులు తెలిపారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలావరకు అస్పష్టంగా, పరిపాలనలో అసౌకర్యంగా మారాయని మంత్రి అనగాని విమర్శించారు. అందుకే ఈ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాల ఆధారంగా, పరిపాలనా దృక్పథంతో కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తుందని తెలిపారు.
పరిష్కారాలకు చర్యలు
జిల్లాల పునర్వ్యవస్థీకరణ క్రమంలో రెవెన్యూ గ్రామాలు, మండలాలు, డివిజన్లు మరియు జిల్లాల సరిహద్దులపైనే ప్రధానంగా కసరత్తు జరుగుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గాల కేటాయింపులో ఎటువంటి మార్పులు ఉండబోవని, ఇది ఎన్నికల సంఘ పరిధిలోకి వచ్చే అంశమని మంత్రి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. అయితే పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టంచేశారు. కొత్త జిల్లాలు ఏర్పడినా, పేర్లు మారినా వాటంతట అవే వాడుకలోకి వచ్చేవిధంగా ప్రజల అభిప్రాయాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రజల పాత్ర కీలకం
ఈ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం అని మంత్రి అనగాని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు, సూచనలు, అభ్యర్థనలు ఈ వ్యవస్థను మరింత ప్రజానుకూలంగా మలిచేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ దశలో అందరు జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు సమయానికి స్పందించి, తమ అభిప్రాయాలను అధికారికంగా వ్యక్తీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలన్నీ రాష్ట్ర పాలన మరింత సమర్థవంతంగా నడవడానికి, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవడానికి దోహదపడతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. డిసెంబర్ 31వ తేదీ నాటికి జిల్లా పేర్లు, సరిహద్దుల మార్పుల ప్రక్రియ పూర్తవుతుందన్న మంత్రి వ్యాఖ్యలు, ప్రభుత్వ నిబద్ధతను స్పష్టంగా చూపుతున్నాయి.