Site icon HashtagU Telugu

Unstoppable : కామెడీ షో, కుంభ‌క‌ర్ణ సేనాని! హీరోల‌పై రోజా సెటైర్లు!!

Roja Unstoppable2

Roja Unstoppable2

హీరో బాల‌క్రిష్ణ హోస్ట్ చేస్తోన్న `అన్ స్టాప‌బుల్ ` షోను, జ‌న‌సేనాని అప్పుడ‌ప్పుడు చేసే రాజ‌కీయంపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు, లోకేష్ గెస్ట్ లుగా పాల్గొన్న షో ప్రోమో మీద ఆమె రియాక్ట్ అయ్యారు. అదో కామెడీ షో అంటూ వ్యంగ్యాస్త్రాలు వేస్తూ అబద్దాల‌ను ఆ ఫ్లాట్ ఫాం మీద చెప్పార‌ని ఆరోపించారు. పార్టీ ఆఫీస్ ల్లో ఎన్టీఆర్ ఫోటోల‌ను లేకుండా చేసిన‌ప్పుడు తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాన‌ని గుర్తు చేశారు. సానుకూల మీడియా ద్వారా వెన్నుపోటును వ‌క్రీక‌రిస్తూ ప‌లు ప్ర‌య‌త్నాలు చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు కామెడీ షో వేదిక‌గా స్వర్గీయ ఎన్టీఆర్ కాళ్ల ప‌ట్టుకున్నానంటూ అబ‌ద్దాలు చెబుతూ ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్ట‌వ‌ద్దంటూ ధ్వ‌జ‌మెత్తారు.

కుంభ‌క‌ర్ణుడు నిద్ర మాదిరిగా జ‌న‌సేనాని ఆరు నెల‌ల‌కు ఒక‌సారి అప్పుడ‌ప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తుంటార‌ని ప‌వ‌న్ మీద సెటైర్లు వేశారు. ఆయ‌న రెండు రోజుల క్రితం చేసిన ట్వీట్ల మీద జోక్స్ వేశారు. మంత్రి రోజా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన తరువాత పవన్ కళ్యాణ్ ఆరు నెలలు నిద్రపోయి ఆరు నెలలు మేల్కొనే కుంభకర్ణుడని అన్నారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర ప్రజల వలసలను పవన్ కల్యాణ్ చూడలేదని, బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని ప‌వ‌న్ ను ప్ర‌శ్నించారు. వైఎస్సార్సీపీ విశాఖ గర్జనపై పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గతాన్ని పంచుకున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో ప్రోమోపై రోజా సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. తిరుగులేని కామెడీ షోలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ అబద్ధాలు చెప్పారని అన్నారు. అధికార దాహంతో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమయ్యారని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ పాదాలు తాకి ఏడ్చేశానంటూ చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ ఫొటోలను చంద్రబాబు నాయుడు విసిరేశారని మంత్రి రోజా అన్నారు.

మొత్తం మీద శుక్ర‌వారం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న త‌రువాత టాప్ హీరోలుగా ఉన్న బాల‌క్రిష్ణ‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌ను ఒక రేంజ్ లో ఆడుకున్నారు. విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళుతోన్న ప‌వ‌న్, అన్ స్టాప‌బుల్ సీజ‌న్ 2 ఫ‌స్ట్ షో రిలీజు రోజు బాల‌య్య‌ను టార్గెట్ చేశారు. ఒకే రోజు ఒకే స‌మ‌యంలో ఇద్ద‌రు హీరోల‌ను రోజా క‌డిగిపారేస్తూ సెటైర్లు వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.