Site icon HashtagU Telugu

Minister Roja : మంత్రి రోజాకు న‌గుబాటు

Roja

Roja

టైం బాగున్న‌ప్పుడు ఏమి చేసినా అనుకూలిస్తుందంటారు పెద్ద‌లు. బ‌హుశా రోజా కు ఇంత కాలం అనుకూల కాలం న‌డిచింది. అందుకే, గ్రూపు పాలిటిక్స్ ఆమెను వెంటాడిన‌ప్ప‌టికీ మంత్రి అయ్యారు. అయిన‌ప్ప‌టికీ ఆ త‌ర‌హా ప్రొటోకాల్ మాత్రం ఆమెకు ల‌భించడంలేదు. కార‌ణం జ‌గన్మోహ‌న్ రెడ్డి వ‌ద్ద ఆమె గ్రాఫ్ ఢ‌మాల్ అంటూ తాడేప‌ల్లి స‌ర్కిల్స్ లోని టాక్.

తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన ఆమె వైసీపీ త‌ర‌పున బ‌రిలోకి దిగి రెండుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యే అయ్యారు. రెండోసారి గెలిచిన తరువాత ఏపీఐసీసీ చైర్మ‌న్ ప‌ద‌విని సీఎం జ‌గ‌న్ అప్ప‌గించారు. ఆ స‌మ‌యంలో ప‌లు ఆరోప‌ణ‌లు తాడేప‌ల్లి వ‌ర‌కు చేరాయి. అందుకే, రెండోసారి ఆమెకు ఆ ప‌ద‌విని పొడ‌గించ‌లేద‌ని వైసీపీ వ‌ర్గాలు చెప్పుకుంటాయి. దాదాపుగా ఏడాది పాటు ఆమె ఎమ్మెల్యేగా మాత్ర‌మే ఉండిపోయారు. ఆ స‌మ‌యంలో జ‌బ‌ర్ద‌స్ ప్రోగ్రామ్ కు ఇచ్చే టైమ్ ఓట‌ర్ల‌కు ఇవ్వ‌డంలేద‌నే ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు. జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, సీనియ‌ర్లు చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి, క‌రుణాక‌ర్ రెడ్డి త‌దిత‌రుల‌తో ఆమెకు పొస‌గ‌దు. దీంతో ఆమెకు మంత్రి ప‌ద‌వి అసాధ్య‌మ‌ని చాలా మంది భావించారు. అయితే, రెండో విడ‌త క్యాబినెట్ ఏర్పాటులో జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు.

మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన రోజు నుంచి వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. మంత్రుల గ్రూప్ ఫోటో దిగిన స‌మ‌యంలో చేసిన ఓవ‌రాక్ష‌న్ ఆమెను వెంటాడుతోంది. స్వ‌ప‌క్షంలోని వ్య‌తిరేక గ్రూప్ మీద ఫైట్ చేయాల‌ని ప్ర‌యత్నించి భంగ‌ప‌డ్డారు. నియోజ‌క‌వ‌ర్గంలోని వ్య‌తిరేక గ్రూప్ లీడ‌ర్ల‌కు కార్పొరేషన్ ప‌ద‌వుల‌ను ఇవ్వ‌డంతో రోజాకు ప‌రోక్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెక్ పెట్టారు. అప్ప‌టి నుంచి ఆమె వ్య‌తిరేక గ్రూపు ప్ర‌తి సంద‌ర్భంలోనూ పైచేయిగా నిలుస్తోంది. మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన త‌రువాత కుమారుడికి బెంజ్ కారు గిప్ట్ ఇవ్వ‌డం ద్వారా రోజా వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ప‌ర్యాట‌క‌శాఖ ఒప్పందాల్లో ఇటీవ‌ల అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

మొత్తం మీద తాడేప‌ల్లి క్యాంప‌స్ వ‌ద్ద రోజా గ్రాఫ్ బాగాలేద‌ని తెలిసిన త‌రువాత న‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆమె గ్రూప్ దూకుడు పెంచింది. మంత్రి రోజా లేకుండా ప‌లు కార్య‌క్ర‌మాల‌ను చేసుకుంటూ వెళుతున్నారు. తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలోని నిండ్ర రైతు భ‌రోసా కేంద్రానికి సోమ‌వారం భూమి పూజ జ‌రిగింది. ప్రోటోకాల్ ప్ర‌కారం మంత్రిని ఆహ్వానించ‌క‌పోగా, ఆమె లేకుండానే శ్రీశైలం బోర్డు చైర్మ‌న్ చ‌క్ర‌పాణి రెడ్డి భూమి పూజను ముగించారు. ముఖ్య అతిథిగా ఈడిగ కార్పొరేష‌న్ చైర్మ‌న్ కేజే శాంతి హాజరు కావ‌డం మంత్రి రోజాకు స‌రికొత్త ప్రోటోకాల్ స‌వాల్
ఎదురైయింది.