Nara Lokesh Slams YS Jagan : జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ మండిపాటు – “ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకో”

కుట్టుమిషన్ల విషయమై మాజీ సీఎం జగన్ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. అందులో ప్రభుత్వ ధనం ఏ మాత్రం లేవని, పూర్తిగా తన వ్యక్తిగత నిధులతోనే ఆ పథకాన్ని అమలు చేశానని ఆయన స్పష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh Slams YS Jagan

Nara Lokesh Slams YS Jagan

Nara Lokesh Slams YS Jagan: ప్రభుత్వ సొమ్ముతో కుట్టుమిషన్లను కొనుగోలు చేసి, వాటికి పసుపు రంగు వేసి పంచుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. వైసీపీ ఫేక్ పార్టీ అని మండిపడ్డ మంత్రి, ప్రజల ధనాన్ని దోచుకోవడమే ఆ పార్టీ లక్ష్యం అని ఆరోపించారు. తనకు జనాల సొమ్ము కాజేయాలనే ఆలోచనే లేదని, తాను ఎమ్మెల్యే కాకముందే మంగళగిరి ప్రజలకు తన స్వంత నిధులతో స్వయం ఉపాధి కోసం చేయూతనిచ్చానని తెలిపారు.

సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ఇలా ట్వీట్ చేశారు:

“జగన్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలూ ప్రజలను గాలికి వదిలేసి, వారి ధనాన్ని దోచుకోవడమే పనిగా చేసాడు. అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు. ప్రజల కోసమే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు స్వయం ఉపాధికి చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నాను. మహిళలు, చేనేత వర్గాలు, స్వర్ణకారులు, చిరు వ్యాపారులకు అవసరమైన సామాగ్రి, ఆర్థిక సాయాన్ని నా సొంత నిధులతో అందించాను.”

“కుల, మత భేదాలు లేకుండా, తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ఆశించే వేలాది మహిళలకు ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత శిక్షణ కల్పించాం. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్లు, ఉచితంగా కుట్టుమిషన్లు, మెటీరియల్ పంపిణీ చేశాం. ఇవన్నీ నా జేబు నుంచి వెచ్చించిన డబ్బులతో చేశాను. అందుకే నా పార్టీ బాధ్యతకు ప్రతీకగా పసుపు రంగు మిషన్లు ఇచ్చాను. ప్రభుత్వం సొమ్ముతో చేసిన పథకాలపై పార్టీ రంగులు వేసుకోవాలని మా ఉద్దేశం కాదు.”

“మంగళగిరిలోని స్త్రీ శక్తి కేంద్రాన్ని 2022 జూన్ 20న ప్రారంభించాం. ఇప్పటివరకు అక్కడ 43 బ్యాచుల్లో 2226 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు, అందరికీ మిషన్లు అందించాం. తాడేపల్లిలో 2023 ఫిబ్రవరి 1న ప్రారంభించిన కేంద్రంలో 17 బ్యాచుల్లో 666 మందికి, దుగ్గిరాలలో 2023 ఏప్రిల్ 10న ప్రారంభించిన కేంద్రంలో 16 బ్యాచుల్లో 616 మందికి మిషన్లు ఉచితంగా ఇచ్చాం. మొత్తం 3508 మందికి శిక్షణతో పాటు నాణ్యమైన కుట్టుమిషన్లు అందించాం.”

“ఇవన్నీ నా వ్యక్తిగత నిధులతో చేసినవి. నీలా ప్రజల సొమ్ముతో చేసిన పథకాలపై పార్టీ పేరు, రంగులు వేసుకోవాలనే యావ మాకు లేదు. నీ అబద్ధం తాత్కాలికం. మా నిజం శాశ్వతం. ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకో.”

  Last Updated: 10 May 2025, 04:11 PM IST