రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. గత వారం రోజుల పాటు నిర్వహించిన ఈ పర్యటనలో, ఆయన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా 100కి పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని నేరుగా పెంచడంలో మంత్రి నారా లోకేష్ విజయం సాధించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) విజన్‌ను కూడా ఆయన ప్రదర్శించారు.
ఐదేళ్ల విధ్వంసక పాలనలో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడం లక్ష్యంగా మంత్రి లోకేష్ టూర్ కొనసాగింది. ఆయన ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. ఈ భేటీల నేపథ్యంలో జనవరిలో దావోస్‌లో జరిగే పెట్టుబడుల సదస్సులో భారీ ఒప్పందాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. లోకేష్ పర్యటన విజయవంతంగా ముగిసినందుకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికాలో లోకేష్ బిజీబిజీగా గడిపారు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ఈ క్రమంలో, ఏపీకి పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నట్లు సమాచారం. కంపెనీలు వచ్చినట్లయితే, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చు. జగన్ హయాంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోతే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. నవ్యాంధ్రకు పెట్టుబడులను తీసుకురావడం లక్ష్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ అమెరికా పర్యటన చేపట్టారు. ప్రముఖ దిగ్గజ కంపెనీల అధిపతులతో విస్తృతంగా చర్చలు జరిపారు.
ఏపీలో పెట్టుబడులకు అవకాశాలపై లోకేష్ వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుద్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్ కార్లు, మరియు రియల్‌ఎస్టేట్ రంగాలలో ప్రముఖులతో సంప్రదింపులు నిర్వహించారు. అమరావతి, ఉత్తరాంధ్ర, గోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే విధంగా ఆయా రంగాల్లో అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆయన పర్యటనలో సీఎంవో సంయుక్త కార్యదర్శి కార్తికేయ మిశ్రా కూడా పాల్గొన్నారు.
గత నెల 25వ తేదీన హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన లోకేష్, మర్నాటి నుంచి వారం రోజుల పాటు అనేక సంస్థల సీఈవోలు, అధినేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో తన పర్యటనను ముగించుకొని, ఈరోజు (శనివారం) భారత కాలమానం ప్రకారం స్వదేశానికి బయలుదేరతారు. ఆదివారం హైదరాబాద్ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలియజేశాయి.