Defamation case : 2019లో సాక్షి పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేష్ ఈరోజు విశాఖలో కోర్టుకు వెళ్లారు. ఈ మేరకు ఆయన మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 సాక్షి తనపై ఒక కథనం రాసిందని.. తాను గతంలో మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం తన కోసం సుమారు రూ. 25 లక్షలు ఖర్చు చేసిందని వార్త రాసిందని.. దీనికి సంబంధించి అప్పుడు తాను ఆధారాలు చూపించాలంటూ సాక్షిపై లీగల్ నోటీసు జారీ చేశానని లోకేష్ తెలిపారు.
ఇవాళ కూడా మంత్రి హోదాలో విశాఖకు వచ్చినా పార్టీ ఆఫీసులో బస్సులో నిద్రించినట్లు తెలిపారు. అక్కడ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే రీజాయిండర్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశామని చెప్పారు. పదే పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ఇప్పటికి నాలుగుసార్లు హాజరయ్యానని, ఇంకా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానన్నారు. నిజం తనవైపు ఉందని, ఎప్పటికైనా అది గెలుస్తుందని నమ్ముతున్నట్లు లోకేశ్ చెప్పారు.
జగన్‌పై తల్లి, చెల్లికే నమ్మకం లేదు.. ఇక నాయకులకేం ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వ అవినీతి కేసులపై వెంటనే విచారణ జరపడం కుదరదని, ఒక్కొక్కటిగా అన్నీ చేస్తామని, వేచి చూడాలని అన్నారు. తప్పు చేసినవారిని ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగించినా అహర్నిశలు కష్టపడతానని అన్నారు. తనవల్ల పార్టీకి ఏనాడూ చెడ్డపేరు రాకుండా చూసుకుంటానని తెలిపారు. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు పర్యాయాలకు మించి ఉండకూడదని అన్నారు. పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలనేది తన అభిప్రాయమని అన్నారు. మూడు పర్యాయాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని.. ఈసారి ఆ పదవిలో ఉండకూడదనుకుంటున్నానని మంత్రి లోకేష్ వెల్లడించారు.
Read Also: Hari Hara Veera Mallu : మేకర్స్ ఇలా చేశారేంటీ… గందరగోళంలో పవన్ ఫ్యాన్స్..!