Site icon HashtagU Telugu

Anniversaries : లోకేష్‌ మార్క్..విద్యాశాఖలో కీలక సంస్కరణలు..!!

Nara Lokesh

Nara Lokesh

Anniversaries : ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. జనవరి 27న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. చదువులో ముందున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తారు. ఈ మార్పుల గురించి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి అధికారులు నిర్ణయించారు. అకడమిక్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేశారు. 9,10 తరగతుల స్టూడెంట్స్‌కు AI, కోడింగ్ లాంటి ప్రత్యేక కోర్సులు అందించనున్నారు. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వర రావు సహకారంతో నైతికత, రాజ్యాంగ విలువలు, లింగ సమానత్వం వంటి వాటిపై విద్యార్థులకు బోధిస్తారు. ఆరో తరగతి విద్యార్థులకు వేసవి సెలవుల తర్వాత కొన్ని రోజులు బ్రిడ్జి కోర్సు నిర్వహించనున్నారు.

Read Also: Posani Krishan Murali : ఎట్టకేలకు జైలు నుంచి పోసాని విడుదల

కీలక నిర్ణయాలు..

ఇందులో భాగంగా ప్రతి శనివారం నో బ్యాగ్‌ డే నిర్వహించనున్నారు. ఆ రోజు విద్యార్థులు పుస్తకాలు సంచులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మార్చి 15 నాటికి వార్షిక పరీక్షలు పూర్తి చేసి, తర్వాత పదో తరగతి సిలబస్‌కు సంబంధింతి బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. పదో తరగతి సిలబస్‌ను నవంబర్‌ను నెలాఖరు నాటికి పూర్తి చేసి డిసెంబరు 5 నుంచి వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు. ప్రీఫైనల్‌ ఫిబ్రవరి 9-19, గ్రాండ్‌ టెస్ట్‌ మార్చి 2-12వ తేదీ వరకు నిర్వహిస్తారు. పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే నాటికి ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

విద్యాశక్తి కార్యక్రమం కింద విద్యార్థులకు హైబ్రిడ్‌ లెర్నింగ్‌ నిర్వహిస్తారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో వెనుకబడిన విద్యార్థులకు తరగతులు కొనసాగిస్తారు. దీని కోసం ఐఐటీ మద్రాస్‌తో విద్యాశాఖ అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. ఫార్మెటివ్‌-1, 2, 3, 4 పరీక్షలు ఆగస్టు 4-7, అక్టోబరు 13-16, వచ్చే ఏడాది జనవరి 5-8, ఫిబ్రవరి 9-12న నిర్వహిస్తారు. సమ్మెటివ్‌-1,2 పరీక్షలు నవంబరు 10-19, వచ్చే సంవత్సరం మార్చి 6-15 నుంచి ఉంటాయి. విద్యార్థుల్లో ఆంగ్ల భాష కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెంపొందించేందుకు మిషన్‌ ఇంగ్లిష్‌ ఫ్లూయన్సీ కార్యక్రమం నిర్వహిస్తారు. విద్యార్థులకు వైద్య విద్య,ఇంజినీరింగ్‌ చదువులు, APPSC, UPSC, బ్యాంకింగ్, ఇతర ఉద్యోగావకాశాలపై మెగా కెరీర్‌ గైడెన్స్‌ ప్రొగ్రామ్‌లు అమలు చేస్తారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన, కౌన్సెలింగ్‌కు స్టూడెంట్‌ వెల్‌ బీయింగ్‌ ప్రోగ్రామ్‌ అమలు చేయనున్నారు.

Read Also: Bangladeshi Hand : నాగ్‌‌పూర్ అల్లర్ల వెనుక ‘బంగ్లా’ హస్తం ..విదేశీ కుట్ర ?