Site icon HashtagU Telugu

Jogi Ramesh : పవన్ కల్యాణ్ అనుచరులను అదుపులో పెట్టుకో..వైసీపీ శ్రేణులు తలచుకుంటే నువ్వు ఎక్కడా తిరగలేవు..!!

Jogi Ramesh

వైజాగ్ వైఎస్సార్ సీపీ మంత్రులపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. విశాఖలో వైసీపీ చేపట్టిన విశాఖ గర్జనకు మంత్రులు జోగిరమేశ్, రోజా, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి హాజరై తిరుగు ప్రయాణంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతల కార్లపై దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తలు ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే జోగిరమేశ్ ఈ ఘటనపై స్పందించారు. ఈ తరహా దాడులు ప్రజాస్వామ్యంలో సరైనవి కావన్నారు. జనసేన శ్రేణులు చిల్లర వేషాలు పక్కన పెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖకు తరలివచ్చిన జనసేన కార్యకర్తలంతా మద్యం మత్తులో ఈ దాడులకు పాల్పడ్డారని జోగిరమేశ్ అన్నారు. పవన్ కల్యాణ్ చిల్లరగాళ్లను పిలుపించుకుని పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ కార్లపై కర్రలు తీసుకుని దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఇది మంచి పద్దతి కాదన్న జోగి రమేశ్…పవన్ తన అనుచరులను ఇప్పటికైనా అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేని పక్షంలో వైసీపీ శ్రేణులు తలచుకుంటే పవన్ రాష్ట్రంలో ఎక్కడా తిరగలేరని జోగి రమేశ్ హెచ్చరించారు.