Site icon HashtagU Telugu

AP Minister Botsa: అమరావతికి వ్యతిరేకం కాదు..రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు

Bostsa

Bostsa

అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందన్నది తమ ఉద్ధేశమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఈ రోజు జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని నేతలకు మంత్రి బొత్స సూచించారు. అమరావతి రైతుల పాదయాత్రను తరిమికొట్టాలంటూ కొందరు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడొద్దంటూ హితువు పలికారు. ఎవరి మనోభావాలనూ దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయొద్దన్నారు.

మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. టాప్-5 సిటీస్‍లో విశాఖ ఉన్నట్లు తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలును న్యాయ రాజధాని చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నామన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవకూడదన్నదే తమ అభిమతమన్నారు. ప్రభుత్వానికి 26 జిల్లాలూ సమానమేనని చెప్పారు. 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదన్నారు.

రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు ఇచ్చారు

అమరావతి రైతులు తమ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇచ్చారని పునరుద్ఘాటించారు. అమరావతి రైతులు అప్పటి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో రాజధాని అమరావతిలోనే కట్టాలని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే వచ్చే నష్టం ఏంటని అడిగారు. టీడీపీ నేతలకు ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. అమరావతిలో రూ.లక్ష కోట్లు పెట్టే బదులు రూ.10 వేల కోట్లు పెడితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అన్ని సంఘాలతో ఉత్తరాంధ్రలో త్వరలో ర్యాలీ నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Exit mobile version