Andhra Pradesh Capital: త్వరలోనే మూడు రాజధానుల బిల్లు.. మంత్రి బొత్స సంచ‌ల‌నం..!

  • Written By:
  • Publish Date - March 4, 2022 / 11:16 AM IST

అమరావతి రాజధాని విషయంలో తాజాగా ఇచ్చిన హైకోర్టు తీర్పుపై న్యాయసలహా తీసుకుంటామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై నిన్న‌ ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సమీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స‌.. అమరావతి రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు తీర్పు పై వైసీపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనే విష‌యం, ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే ఇప్ప‌టీ పరిపాలన వికేంద్రీకరణకు వందశాతం కట్టుబడి ఉన్నామని, రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.

అమరావతి రాజధాని విషయంలో తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముందు ఊహించిందేనని, ఈ తీర్పులో ఎలాంటి కొత్త‌ద‌నం లేద‌ని బొత్స తెలిపారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉందని..త్వరలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏపీ హైకోర్టు తీర్పుపై సీఎం జగన్‌తో చర్చించిన తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా అనేది నిర్ణయిస్తామన్నారు. కోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తరువాతే అన్ని విషయాల్ని వెల్లడిస్తామన్నారు. రాజ్యంగపరంగా చట్టపరిధిలో చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్ ఉన్నాయని, చట్టాలు చేసే అధికారం అసెంబ్లీ లేదంటే ఎలా అని బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ప్రశ్నించారు.

అస‌లు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసివ్వాలంటే ఎలా సాధ్యమని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఏదైనా సరే ప్రాక్టికల్‌గా ఆలోచించాలని, ప్రభుత్వం మాత్రం పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేసేందుకే సిద్ధంగా ఉందన్నారు. ఇక అప్ప‌ట్లో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణ కమిటీ సలహాలు, సూచలను, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నారా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సీఆర్డీఏ చట్టం అమలులో ఉందని, దాని ప్రకారమే ముందుకు వెళతామని మంత్రి బొత్స చెప్పారు. సమయం, ఖర్చు, నిధులు మూడు అంశాలు దాని అమలుపై ముడిపడి ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల అభిప్రాయాలను తీసుకుంటామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఒక సామాజికవర్గం కోసమే అమరావతిని ఎంపిక చేశారని, వైసీపీ దానికి వ్యతికేమని బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ తేల్చి చెప్పారు. ఇక‌పోతే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న‌ అంశాలు ఇవే అన్న‌ట్టు, ఇప్పటికే పలు అంశాలు పలు న్యూస్ చాన‌ళ్ళు, సోష‌ల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఈ క్ర‌మంలో రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకు లేదని, సీఆర్డీఏ చట్టం చెప్పినట్టు నడుచుకోవాలని హైకోర్టు తీర్పులో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజమైతే మరి సీఆర్డీఏ చట్టం కూడా అసెంబ్లీ చేసిందే కదా అనే వాదన విన్పిస్తోంది. దీంతో రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకు లేనప్పుడు, గత ప్రభుత్వం ఇదే రాజధానిపై చేసిన చట్టం ఎలా వర్తిస్తుందంటూ మరో వాదన విన్పిస్తోంది. ఏది ఏమైనా రాజ‌ధాని అంశం ఏపీలో మరోసారి ర‌చ్చ లేప‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయవ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.