ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అలియాస్ వాసు. ఆయన పవర్ ఎంటో ఒంగోలులో జరిగిన గుప్తా దాడితో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది. గుప్తాపై హత్యాయత్నం చేసిన వీరాభిమానులు సంతృప్తి చెందేలా మంత్రి వాసు వ్యవహరించిన తీరు విమర్శలను ఎదుర్కొంటోంది. అధికారం, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చని సాక్షాత్తు మంత్రి నిరూపించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బాలినేని వాసు అధికారదర్పంపై పోస్టులు వైరల్ అవుతున్నాయి.మంత్రులు కొడాలి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బూతు పురాణంపై ఒంగోలు వేదికగా గుప్తా స్పందించాడు. వాళ్లు పార్టీకి మేలు చేస్తున్నారో..కీడు కలిగిస్తున్నారో..తెలియకుండా బూతులు తిడుతున్నారని ఆవేదన చెందాడు. స్వతహాగా బాలినేనికి అనుచరునిగా ఉన్న గుప్తా తప్పులను సరిచేసుకోవాలని సలహా ఇచ్చాడు. అంతే, వాసు వీరాభిమానులకు కోపం వచ్చేసింది. గుప్తా ఇంటి మీదకు వెళ్లారు. కుటుంబీకులను పట్టపగల భయకంపితుల్ని చేశారు. ఒక హోటల్ లో ప్రాణభీతితో ఉన్న గుప్తా పై హత్యాయత్నం చేయడం దారుణం. అతన్ని మోకాళ్ల మీద కూర్చోబెట్టడమే కాకుండా ఆ వీడీయోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం గమనార్హం.
మంత్రి అనుచరులు ఈ విధంగా చేయడం ఏపీ పోలీసులకు సవాల్. హత్యాయత్నం చేస్తున్నట్టు ఉన్న వీడియోను పోస్ట్ చేయడమే కాకుండా దాన్ని హీరోయిజంగా మంత్రి అనుచరులు భావించారు. దానిపై స్పందించిన వాసు విచిత్రమైన కామెంట్ ను ఈ ఘటనకు జోడించాడు. గుప్తా పిచ్చివాడని ముద్రవేసే ప్రయత్నం చేశాడు. మతిస్థిమితం లేనివాడని మీడియాకు చెప్పాడు. మంత్రి చేసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియా తీవ్రంగా రియాక్ట్ అయింది. సీన్ కట్ చేస్తే…24 గంటలు తిరగకముందే గుప్తా చేత బర్త్ డే కేక్ ను తినిపించుకుంటూ మంత్రి వాసు కనిపించాడు. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పెట్టారు. దానిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇలాంటి సంఘటన రెండేళ్ల క్రితం డాక్టర్ సుధాకర్ విషయంలోనూ జరిగింది. ఆ రోజున కరోనా కిట్లు లేవని సుధాకర్ ప్రశ్నాంచాడు. కనీసం మాస్కులు కూడా లేకపోవడాన్ని నిలదీశాడు. దీంతో డాక్టర్ సుధాకర్ మతిస్థిమితంలేని డాక్టర్ అని వైసీపీ లీడర్లు ముద్ర వేశారు. ఆ తరువాత ఆయన తల్లిని మీడియా ముందుకు తీసుకొచ్చి జగన్ సర్కార్ అద్భతమని చెప్పించారు. సీన్ కట్ చేస్తే..కొన్ని రోజులకు సుధాకర్ ప్రాణం విడిచాడు.
ఏడాదిన్నర క్రితం మూడు రాజధానుల అంశంపై విశాఖ వెళ్లిన చంద్రబాబు మీద దాడి చేయడానికి వైసీపీ క్యాడర్ దూసుకొచ్చింది. ఆ సమయంలో అక్కడున్న సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నంచారు. దీంతో ఇన్ స్పెక్టర్ మీద వైసీపీ క్యాడర్ దాడి చేసింది. ఆయన తలకు బలమైన గాయం అయింది. దాడి చేసిన వాళ్లపై కేసులు పెడతారని అందరూ భావించారు. సీన్ కట్ చేస్తే…వైసీపీ క్యాడర్ అభిమానంతో మసాజ్ చేసిన సందర్భంగా తలకు గాయం అయిందని ఇన్ స్పెక్టర్ చేత మీడియా ముఖంగా చెప్పించారు.జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన రఘురామక్రిష్ణంరాజు పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. రచ్చబండ అంటూ రోజూ విమర్శలకు దిగే త్రిబుల్ ఆర్ మీద ఏపీ పోలీసులు కేసులు పెట్టారు. అరెస్ట్ చేసిన తరువాత విచారణ సమయంలో చితకకొట్టారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా తీశారని ఆయన చెబుతున్నారు. పార్లమెంట్ వేదికగా చితకొట్టించుకున్న విషయాన్ని చెబుతున్నాడు.ఈ సంఘటనలే కాకుండా అనేకం జరిగినప్పటికీ వైసీపీ లీడర్ల మీద కేసులు పెట్టడానికి ఏపీ పోలీస్ సాహసించలేకపోతోంది. పైగా బాధితులే మీడియా ముందుకొచ్చి తమదే తప్పు అయిందని చెప్పే దారుణ స్థితికి ఏపీ లా అండ్ ఆర్డర్ పడిపోయింది. ది గ్రేట్ మంత్రి బాలినేని ఎపిసోడ్ ఏపీ పోలీస్ కు తలవంపు కాదంటే..ఇక వాళ్లిష్టం.!