Site icon HashtagU Telugu

Michaung Update: స్పీడు పెంచిన మిచౌంగ్.. నిజాంపట్నంలో 10వ ప్రమాద హెచ్చరిక.. ప్రజల్లో ఉలికిపాటు

Michaung Cyclone

michaung update

Michaung Update: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను.. సోమవారం సాయంత్రానికి తీవ్రతుపానుగా బలపడింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ.. చెన్నైకి 90 కి.మీ, నెల్లూరుకు 120 కి.మీ, మచిలీపట్నం, బాపట్ల తీరాలకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కోస్తాంధ్ర తీరంవైపుగా కదులుతోన్న ఈ తీవ్రతుపాను మంగళవారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా నిజాంపట్నం పట్నం సమీపంలో తీరాన్ని తాకవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రంలో నిజాంపట్నం పోర్టు వద్ద 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మొత్తం 11 హెచ్చరికలుండగా.. 10వ నంబర్ ఎగురవేయడంతో తుపాను తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

నిజాంపట్నం హార్బర్ సహా.. కోస్తాలో అన్నిసముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. డిసెంబర్ 6వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను తీవ్రత పెరిగే కొద్దీ.. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుండటంతో జాలర్లు వేట బోట్లను ఒడ్డుకు చేర్చి, వలలు, బోట్లను జాగ్రత్త చేసుకుంటున్నారు. తుపాను దృష్ట్యా మంగళవారం కూడా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు.

తుపాను తీరం దాటే సమయంలో విధ్వంసం తప్పదన్న హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఆ సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. తుపాను తీరం దాటిన తర్వాత తెనాలి, విజయవాడ మీదుగా కదులుతూ.. మంగళవారం అర్థరాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.