Site icon HashtagU Telugu

Michaung Cyclone : మిగ్ జాం దెబ్బకు తిరుపతిలో కూలిన వందేళ్ల వృక్షం

Michaung Cyclone

Michaung Cyclone Effect 100

మిగ్ జాం తూఫాన్ (Michaung Cyclone) దెబ్బకు ఏపీ (AP) వణికిపోతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుపాను మరికాసేపట్లో బాపట్ల వద్ద తీరం దాటబోతుంది. తీరం దాటుతుండడం తో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇక ఒంగోలు, చీరాల, వినుకొండ, పిడుగురాళ్ల, డిచ్ పల్లి వైపుగా పయనించి.. సాయంత్రానికి మిర్యాలగూడ మీదుగా వెళ్తూ.. అర్థరాత్రి తర్వాత తెలంగాణలోకి వెళ్తుందని, ఆ తర్వాత బుధవారం తెల్లవారుజాముకు సూర్యాపేటను చేరుతుంది. బుధవారం ఉదయం 11 గంటల సమయానికి వరంగల్ వైపుగా వెళ్తుందని ఐఎండీ అంచనా వేసింది.

ఇదిలా ఉంటె మిగ్ జాం తుపానుతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతో తిరుపతి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే వందల గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోకులకృష్ణ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద కాళంగి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై నాలుగు అడుగుల మేర నీటిమట్టంతో వరద ప్రవహిస్తుండటంతో పోలీసులు రహదారిని మూసివేశారు. ఇక శ్రీకాళహస్తిలోని ప్రాజెక్టు వీధిలో వందేళ్లనాటి చెట్టు కూలింది. ఇక నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను, తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలిస్తున్నారు. వారి కోసం మందులు, ఆహార ధాన్యాలు, చిన్న పిల్లలకు పాలు సిద్ధం చేశారు.

కోత కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మిగతా పంట నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరూ కోతలు చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. సీఎం జగన్ సైతం అధికారులను అలర్ట్ చేశారు. ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన అత్యవసర పనుల కోసం జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించాలని, ఇందుకోసం ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

We’re now on WhatsApp. Click to Join.

తుపాను కారణంగా వర్షాలకు ఇళ్లు, గుడిసెలు దెబ్బతింటే వారికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. సహాయక శిబిరాల్లో ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, మందులు, మంచినీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ రూ.1,000 లేదా కుటుంబానికి రూ.2,500 ఇవ్వాలని ఆదేశించారు. శిబిరాలకు రాకుండా ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కిలో చొప్పున ఇవ్వాలని అన్నారు. అలాగే భారీ వర్షాలతో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అండగా నిలబడాలని అధికారులకు నిర్దేశించారు.

Read Also : Uttam Kumar : ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్..