Rain Alert Today : ఏపీలోని ఈ జిల్లాల్లో ఇవాళ వర్షాలు

Rain Alert Today : మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు దక్షిణాన తీరం దాటింది.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 07:51 AM IST

Rain Alert Today : మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు దక్షిణాన తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత తీవ్ర వాయుగుండంగా.. తర్వాత వాయుగుండంగా బలహీనపడింది. తుఫాన్‌ తీరం దాటిన తర్వాత ఉత్తరంగా పయనించి దిశ మార్చుకుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా మీదుగా తెలంగాణలోని ఖమ్మం, అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్ దిశగా పయనించింది.  ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా అది బలహీన పడింది. తుఫాను దిశను మార్చుకున్నందున తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలో వర్షాలు కొనసాగుతాయని.. బుధవారం కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

We’re now on WhatsApp. Click to Join.

మిచౌంగ్ తుఫాన్ బాపట్ల జిల్లాను ముంచెత్తింది. నెల్లూరు జిల్లాను తుఫాన్‌ వణికించింది. తిరుపతి జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపించింది. తుఫాను ప్రభావంతో ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ­గోదావరి, బీఆర్‌ అంబేద్కర్‌ కోన­సీమ, కాకినాడ, తూర్పుగోదా­వరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్‌ ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు 3 మీటర్ల మేర ఎగిసిపడ్డాయి. దాదాపు 50 నుంచి 100 అడుగుల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. సూర్యలంక తీరం వద్ద 3నెలల క్రితమే ప్రారంభించిన పోలీస్‌ వాచ్‌ టవర్‌ కుంగిపోయింది.

Also Read: Aamir Khan: చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్.. కాపాడిన సిబ్బంది

ఇవాళ  కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తిరుపతి, అన్నమయ్య, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.మిచౌంగ్‌ తుఫాన్ వల్ల ఏపీలో లక్షలాది ఎకరాల్లో వరి, పత్తి, శనగ, మినుము, పొగాకు, మొక్కజొన్న, జూట్‌, పసుపు పైర్లు నీటమునిగాయి. అరటి, కంది, బొప్పాయి, మునగ వంటి తోటలు గాలులకు(Rain Alert Today) ధ్వంసమయ్యాయి.