Site icon HashtagU Telugu

Mekapati Gautam Reddy Death: వ‌ర్ణించ‌లేని గుండెకోత‌.. త‌ల్ల‌డిల్లిపోతున్న తండ్రి రాజ‌మోహ‌న్ రెడ్డి..!

Gouthamreddy Rajamohanreddy

Gouthamreddy Rajamohanreddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ రోజు ఉదయం గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని గౌత‌మ్ రెడ్డి నివాసంలో ఆయ‌న‌కు గుండెపోటు రాగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే గౌతమ్‌ రెడ్డి తుదిశ్వాస విడిచారు. అపోలో అసుపత్రికి తీసుకొచ్చి చివరి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. 49 ఏళ్ళ‌కే కొడుకు ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని తండ్రి రాజ‌మోహ‌న్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. త‌న‌యుడి భౌతిక‌కాయం వద్ద వ‌ర్ణించ‌లేద‌ని విధంగా తీర‌ని దుఃఖంతో బోరున విల‌పిస్తున్న రాజ‌మోహ‌న్ రెడ్డిని ఓదార్చ‌డం క‌ష్టంగా మారింది. చెట్టంత‌ కొడుకు ఎదుగుద‌ల‌ చూస్తూ పుత్రోత్సాహం పొందుతున్న రాజమోహన్ రెడ్డికి, కొడుకు గౌతంరెడ్డి ఆక‌స్మిక మృతి ఆయ‌నకు గుండెకోతను మిగిల్చింది. ఈ విషాద సమయంలో మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డిని పరామర్శించడానికి వచ్చిన వారి వద్ద, ఆయ‌న బోరున విల‌పిస్తుంటే, అక్క‌డ ఉన్న వాళ్ళు కూడా క‌న్నీళ్ళు పెట్టుకుంటున్నారు.

ఇక రాజ‌మోహ‌న్ రెడ్డి రాజకీయ వార‌సుడిగా ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతంరెడ్డి, 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి 30,191 ఓట్లతో విజభేరి మోగించారు. ఆ త‌ర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి రెండోసారి విజయం కైవసం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ క్యాబినెట్‌లో చోటు సంపాధించిన గౌతంరెడ్డి పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక‌పోతే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలను పాటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మ‌రోవైపు అధికారిక లాంఛనాలతో గౌత‌మ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. అమెరికాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం అధికార లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. ఇక‌పోతే గౌత‌మ్ రెడ్డి మృతిప‌ట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా గౌత‌మ్ రెడ్డి మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని వైసీపీ నేత‌లు పేర్కొన్నారు. నిన్నటి వరకు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారని, రాష్ట్రం కోసం, పార్టీ కోసం ఆయన కృషి చేసిన తీరును ఒక‌సారి గుర్తుకు తెచ్చుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.