Site icon HashtagU Telugu

Goutham Reddy: గౌత‌మ్ రెడ్డి పొలిటిక‌ల్ ఎంట్రీ.. తొలి పోటీలోనే సూప‌ర్ విక్ట‌రీ

Mekapati Goutham Reddy

Mekapati Goutham Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం, వైసీపీ శ్రేణుల్లో విషాదం నింపింది. సోమవారం ఉదయం గుండెపోటు రావ‌డంతో గౌతమ్ రెడ్డి కుటుంబీకులు, సిబ్బంది హుటాహుటిన ఆయనను జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్ర‌మంలో ఆస్పత్రి వైద్యులు ఎమర్జెన్సీ ప్రాతిపదికన చికిత్స అందించే ప్రయత్నం చేయ‌గా, వైద్యులకు ఆయన పల్స్ దొరకలేదని, వైద్యులు ఎంత ప్ర‌య‌త్నించినా, చికిత్సకు ఆయ‌న‌ శరీరం ఏమాత్రం సహ‌క‌రించ‌క‌పోవ‌డంతో, గౌతమ్ రెడ్డి మృతి చెందారు. దీంతో మేకపాటి గౌతంరెడ్డి మరణవార్త రెండు తెలుగు రాష్ట్రాలను షాక్‌కు గురిచేసింది.

ఇక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, బ్రాహ్మణ పల్లిలో 1971 నవంబర్ 2న మేకపాటి రాజమోహన్ రెడ్డి, మణిమంజరి దంపతులకు జన్మించారు. 1994-1997లో మాంచెస్టర్ యుకెలో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ విశ్వవిద్యాలయం నుండి ప‌ట్టా పొందిన‌ గౌతమ్ రెడ్డి, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో వ్యాపార వేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. గౌతమ్‌రెడ్డికి భార్య శ్రీకీర్తి, కుమార్తె అనన్య రెడ్డి, కొడుకు అర్జున్ రెడ్డి ఉన్నారు. ఇక వ్యాపార‌వేత్త‌గా స‌క్సెస్ అయిన గౌతంరెడ్డి, జ‌గ‌న్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏపీలో 2014లో జ‌రిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన గౌతంరెడ్డి మంచి విజయం సాధించారు.

ఆ త‌ర్వాత 2019లో జ‌రిగిన‌ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆత్మకూరు నియోజకవర్గం నుండే పోటీ చేసిన గౌతం రెడ్డి, రెండోసారి కూడా విజ‌యం సాధించి, సీఎం జగన్ కేబినెట్‌లో చోటు సంపాంధించారు. ఈ క్ర‌మంలో ఏపీలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎంతో సౌమ్యుడిగా పేరొందిన మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి వివాదాల‌కు దూరంగా ఉంటారు. రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రితో క‌లిసిపోతారు. ఇటీవ‌ల‌ వారంరోజుల క్రితం దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఆయన నిన్నే తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇంతలోనే ఆయన గుండెపోటుకు గురవ్వడం, చికిత్స పొందుతూ మర‌ణించ‌డం వెంటవెంటనే జరిగిపోయింది. దీంతో ఆయ‌న కుటుంబంంలోనే కాకుండా వైసీపీ శ్రేణుల్లోనూ విషాదం నెల‌కొంది. ఇక‌ వైసీపీ ప్ర‌ముఖులు గౌత‌మ్ రెడ్డికి నివాళుల‌ర్పించేందుకు హైద‌రాబాద్‌కు వెళుతున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న మృత‌దేహాన్ని నెల్లూరు జిల్లాలోని ఆయ‌న స్వ‌స్థ‌లానికి తీసుకెళ్లే అవ‌కాశాలున్నాయని స‌మాచారం.