ఎన్నారై అకాడ‌మీ పోస్ట్ మార్టం.. మేఘా,లింగ‌మ‌నేని ఆస్తుల‌పై ఆప‌రేష‌న్

మంగళగిరి ఎన్నారై అకాడమీ యాజమాన్య మార్పిడిపై జరిగిన వివాదంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. విజయవాడకు చెందిన లింగమనేని రమేష్, మేఘా కృష్ణారెడ్డిల పాత్రపై ఈడీకి పక్కా ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - September 27, 2021 / 12:51 PM IST

మంగళగిరి ఎన్నారై అకాడమీ యాజమాన్య మార్పిడిపై జరిగిన వివాదంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. విజయవాడకు చెందిన లింగమనేని రమేష్, మేఘా కృష్ణారెడ్డిల పాత్రపై ఈడీకి పక్కా ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది. విచార‌ణ లేకుండా బ‌య‌ట‌ప‌డేందుకు ఢిల్లీ స్థాయిలో మేఘా చ‌క్రం తిప్పుతున్నార‌ని టాక్. మీడియా, రాజ‌కీయ. ప‌లుకుబ‌డితో ఈడీ క‌న్ను మూయాల‌ని పెద్ద ఎత్తున ఎత్తుగ‌డ‌లు వేస్తున్న‌ట్టు వినికిడి.
లింగ‌మ‌నేని ర‌మేష్ ఆస్తుల విలువ సుమారు 5వేల కోట్ల‌కు పైగా ఉంటాయ‌ని ఈడీ అంచ‌నా వేస్తోంది. కృష్ణాజిల్లా పెదముత్తేవికి చెందిన రమేష్ తండ్రి పూర్ణ భాస్కరరావుకు అప్పట్లో రెండెకరాల పొలం వుండేదట‌. ఆ పొలం అమ్మి ఒక లారీ కొని విజయవాడలో తన బంధువుకు చెందిన చిన్న రేకుల షెడ్లో వుండేవాడట‌. నష్టాలు రావటంతో వ్యాపారాన్ని, కుటుంబాన్ని వదిలేశాడ‌ని, రమేష్ తన బంధువుల సహకారంతో చదువుకున్నాడ‌ని ఆయ‌న బంధువులు చెబుతుంటారు.
రమేష్ చదువయ్యాక ఆస్ట్రేలియాలో వుంటున్న బొబ్బా శివప్రకాష్ ను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించాడ‌ట‌. ఆ పెట్టుబడితో ఇద్దరి భాగస్వామ్యంలో విజయవాడలో రియల్ఎస్టేట్ వ్యాపారం ర‌మేష్ మొదలుపెట్టారు. విజయవాడ సమీపంలో మద్రాసు-కలకత్తా హైవే పక్కనే బొబ్బా శివప్రకాష్ కు చెందిన 60 ఎకరాల్లో రెయిన్ ట్రీ పార్క్ పేరుతో అతి పెద్ద ప్రాజెక్టు నిర్మించాడు. ఆ తరువాత పలువురు ప్రముఖుల వద్ద వందల కోట్లు వసూలు చేసి రియల్ ఎస్టేట్ రంగంలో, ఎయిర్ కోస్టా పేరుతో ప్రారంభించిన విమానయాన కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు.
తాజాగా ఈయ‌న ఆస్తుల‌పై ఈడీ క‌న్నేసింద‌ని తెలుస్తోంది. టీడీపీ హ‌యాంలో కింగ్ లా మెరిసిన లింగ‌మ‌నేని ప్ర‌స్తుతం సైలెంట్ గా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ లింగ‌మ‌నేని, మేఘా ఆస్తుల‌పై వ‌చ్చిన ఫిర్యాదును అందుకున్న ఈడీ ప్ర‌త్యేక నిఘా పెట్టింద‌ని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. ప‌క్కా ఆధారాల‌తో వాళ్లిద్ద‌రి భ‌ర‌తం ప‌ట్టేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింద‌ని తెలుస్తోంది. నిజంగా వాళ్లిద్ద‌రి ఆస్తుల వ్య‌వ‌హారాన్ని ఈడీ బ‌య‌ట‌పెడుతుందా? లేక జ‌స్ట్ ప్ర‌చారం వ‌ర‌కు ప‌రిమిత‌మా? అనేది త్వ‌ర‌లోనే తెలియ‌బోతుంది.