Chiranjeevi : సినీ, రాజ‌కీయ చౌర‌స్తాలో `చిరంజీవి`

`రాజ‌కీయాల్ని వ‌దిలేశాను. రాజ‌కీయాలు న‌న్ను వ‌ద‌ల్లేదు. ఆ డైలాగును ఇటీవ‌ల `గాడ్ ఫాద‌ర్‌` సినిమాలో ఉప‌యోగించారు మెగాస్టార్ చిరంజీవి.

  • Written By:
  • Updated On - September 22, 2022 / 01:26 PM IST

`రాజ‌కీయాల్ని వ‌దిలేశాను. రాజ‌కీయాలు న‌న్ను వ‌ద‌ల్లేదు. ఆ డైలాగును ఇటీవ‌ల `గాడ్ ఫాద‌ర్‌` సినిమాలో ఉప‌యోగించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ ఆడియో క్లిప్పింగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అదే స‌మ‌యంలో చిరంజీవికి ఏఐసీసీ టెలిగేట్ గా కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డును ముద్రించింది. ఆ కార్డు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నిక‌ల‌కు ముందుగా ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించారు. ఆనాడు మెగా హీరోలు, నిర్మాత‌లు, డైరెక్ట‌ర్లు ఐక్యంగా ప‌నిచేశారు. యువ‌రాజ్యం అధ్య‌క్షునిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ విస్తృతంగా ఉమ్మ‌డి ఏపీలో ప్ర‌చారం చేశారు. మెగా కాంపౌండ్ లోని హీరోలు అంద‌రూ ప్ర‌త్యేక రైలు ప్ర‌యాణం చేస్తూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. సీన్ క‌ట్ చేస్తే, 18 మంది ఎమ్మెల్యేలకు ప్ర‌జారాజ్యం ప‌రిమితం అయింది. ఆ త‌రువాత కేంద్ర మంత్రి ప‌ద‌విని తీసుకుని కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జారాజ్యం పార్టీని విలీనం చేసిన విష‌యం అందరికీ తెలిసిందే.

Also Read:   Jeevitha and Vijayasanthi: జహీరాబాద్ బరిలో జీవిత.. విజయశాంతి సంగతేంటి?

కేంద్ర మంత్రిగా 2014 వ‌ర‌కు చిరంజీవి కొన‌సాగారు. ఆనాడు రాష్ట్రం విడిపోయిన‌ప్ప‌టికీ ప‌ద‌వికి రాజీనామా చేసి నిర‌స‌న వ్య‌క్తం చేయ‌లేదు. చివ‌రి నిమిషం వ‌ర‌కు ప‌ద‌విని చిరంజీవి ఆశ్వాదించారు. రెండుగా ఏపీ విడిపోయిన త‌రువాత ఏర్ప‌డిన రాష్ట్రానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్ గా చిరంజీవి ప్ర‌చారం చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఎక్క‌డా డిపాజిట్లు రాలేదు. అప్ప‌టి నుంచి క్ర‌మంగా కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న దూరంగా ఉంటున్నారు. సినిమాల వైపు మ‌ళ్లారు. ఖైదీ నెం 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సినిమా లోకంలో మునిగిపోయారు. కానీ, ఆయ‌న‌తో సినిమాలు తీయ‌డానికి నిర్మాత‌లు పెద్ద‌గా ముందుకు రాలేదు. దీంతో సొంత బ్యాన‌ర్ తో సినిమాలు తీసిన‌ప్ప‌టికీ వెండితెర‌మీద హిట్ కాలేదు. దీంతో భారీగా న‌ష్ట‌పోయిన ఆయ‌న మ‌ళ్లీ రాజ‌కీయాల వైపు అడుగు పెట్టే క్ర‌మంలో గాడ్ ఫార‌ద్ సినిమాలో ఒక డైలాగును పెట్టార‌ని టాలీవుడ్ టాక్‌.

యువ‌రాజ్యం అధ్య‌క్షునిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎనిమిదేళ్లుగా జ‌న‌సేన పార్టీని న‌డుపుతున్నారు. ప్ర‌జారాజ్యం విలీనం త‌రువాత మెగా కాంపౌండ్ నుంచి జ‌న‌సేన పార్టీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దానికి అండ‌గా నిల‌వాల‌ని చిరంజీవి భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆయ‌న మీద బీజేపీ, వైసీపీ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇదే సంద‌ర్భంలో ఏఐసీసీ డెలిగేట్ కార్డును కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read:   Pawan Kalyan : `జ‌న‌సేనాని` అమెరికా యాత్ర లోగుట్టు!

వాస్త‌వంగా కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి చిరంజీవి రాజీనామా చేయ‌లేదు. ప్ర‌జారాజ్యం పార్టీ విలీనం నుంచి ఆ పార్టీలో కొన‌సాగుతున్నారు. ఉమ్మ‌డి ఏపీలో ఉన్న పీసీసీ కార్య‌వ‌ర్గంలో ఆయ‌న ఉన్నారు. దాన్ని మ‌ళ్లీ బుధ‌వారం నాడు పున‌ర్వ‌వ‌స్థీక‌రిస్తూ మ‌రికొంద‌ర్ని క‌లుపుకుని ఐడీ కార్డుల‌ను విడుద‌ల చేసింది. ఆ క్ర‌మంలో చిరంజీవికి కూడా ఐడీ కార్డును ఇచ్చింది. యాదృశ్చికంగా గాడ్ ఫాద‌ర్ డైలాగు, కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డ్ ఒక‌రోజు అటూఇటుగా విడుద‌ల కావ‌డం రాజ‌కీయ, సినీ వ‌ర్గాల్లో చిరంజీవి భవిష్య‌త్ అడుగుల‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.