Site icon HashtagU Telugu

Mega Politics: అన్నాదమ్ముల ‘ఆట’

Chiranjeevi Pawan Kalyan Imresizer

Chiranjeevi Pawan Kalyan Imresizer

కులం కూడు పెట్టదు అంటారు పెద్దలు. కానీ, కులం ఓట్లు కురిపిస్తుందని ఈనాటి రాజకీయ నాయకులు నమ్ముతున్నారు. అందుకే కాపు ఓటు బ్యాంకు కోసం టీడీపీ, వైసీపీ మెగా గేమ్ ఆడుతున్నాయి. సామాజిక సమస్యలను గాలికి వదిలేసి బీమ్లా నాయక్ సినిమా పై రాజకీయాన్ని వేడెక్కించాయి. మెగా కుటుంబంలోని చిరంజీవికి వైసీపీ మద్దతు. అదే కుటుంబంలోని పవన్ కు టీడీపీ అండ.

వాళ్లిద్దరి చుట్టూ రాజకీయాన్ని రచ్చ చేస్తున్నారు. చిరంజీవి అందరివాడు అంటూ మంత్రి కొడాలి నాని ఆకాశానికి ఎత్తాడు. ఆయన వ్యక్తిత్వం అమోఘం అంటూ బాజా వాయించాడు. టాలీవుడ్ లో చిరంజీవి కి మరోసారి ‘పెద్ద’ కిరీటం మంత్రి కొడాలి తగిలించాడు. అంతేనా, ఆయన తాడేపల్లి వచ్చినప్పుడు ఏపీ సీఎం జగన్ దంపతులు ఇచ్చిన విందు గురించి గొప్పగా చెప్పాడు. గుమ్మం వద్దకు వచ్చి చిరంజీవిని ఆహ్వానించిన జగన్ మర్యాదను విడమరిచి చెప్పాడు. సంక్రాంతి విందు నుంచి మొన్నటి చేతులు జోడించి జగన్ కు నమస్కారం పెట్టిన ఎపిసోడ్ వరకు నాని మీడియాకు వివరించాడు.

స్నేహితుడు, సన్నిహితుడు నాగార్జున కంటే ఎక్కువగా చిరంజీవికి ప్రాధాన్యత తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేయటం కాపు ఓట్ పవర్ ను తెలియచేస్తుంది. అంతే కాదు , చిరంజీవికి గాలం వేస్తున్నట్టు ఆ మీడియా సమావేశం స్పష్టం చేస్తోంది. వైసీపీలోకి ఆయన్ను ఎలాగైనా ఆకర్షించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం తెలంగాణ నుంచి ఓ పారిశ్రామికవేత్త ద్వారా లాబీయింగ్ జరుగుతోందని తెలుస్తోంది. అందుకు బలం చేకూరేలా వైసీపీ వ్యవహారం ఉంది. జీవో నెంబర్ 35 అందరికి ఒకటేనని, అవే నిబంధనలు అఖండ , బంగార్రాజు , బీమ్ల కు ఉన్నాయని మంత్రి చెప్పాడు. ప్రత్యేక నోటీసులు బీమ్ల కు ఎందుకు జారీ చేశారో ..జగన్ సర్కారుకు తెలియాలి. టీడీపీ ఉద్దేశపూర్వకంగా పవన్ సినిమాను రాజకీయ కోణం నుంచి తీసుకెళ్లింది. ఆ విషయాన్ని గుర్తించిన వైసీపీ ప్రతి దాడికి దిగింది.

జీవో నెంబర్ 35 గురించి టీడీపీ కి తెలుసు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటి నుంచి అది నడుస్తోంది. సినిమా అవార్డులు, నంది అవార్డులు ఇచ్చినప్పుడు ఆనాడు టీడీపీ ప్రభుత్వాన్ని మెగా కుటుంబం హీరోలు దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు జీవో 35 అమలులో ఉన్న విషయం తెలిసి కూడా పవన్ సినిమాకు అన్యాయం అంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. అఖండ సినిమా విడుదల సమయంలో టీడీపీ నోరెత్తలేదు. ఇప్పుడు పవన్ సినిమా విషయంలో రాజకీయాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. కాపు ఓట్ కోసం పవన్ పాట టీడీపీ పాడుతోంది. వన్ సైడ్ లవ్ అంటూ బాబు ప్రేమను పవన్ పై వ్యక్తం చేశాడు.

ప్రజా సమస్య తరహాలో సినిమా అంశాన్ని ప్రధాన ప్రతిపక్షం తీసుకెళ్లింది. ఆ అంశం మీద పత్రికల్లో కాలం కూడా రాసే వరకు వివాదాన్ని నడిపారు. మెగా హీరో పవన్ సామాజిక వర్గం కోసం టీడీపీ పాకులాడుతోంది. అందుకే , బీమ్ల హిట్ పైన టీడీపీ భజన చేస్తోంది. ఇలాంటి ప్రయోగం చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో బీసీలను దూరం చేసుకుంది. ఆనాడు అగ్రవర్ణ పేదలకు మోడీ ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో 5 శాతం కాపులకు ఇస్తానని బాబు హామీ ఇచ్చాడు. ఫలితంగా ఆవిర్భావం నుంచి అండగా ఉండే బీసీలు టీడీపీకి దూరం కావటంతో 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయింది.

ఇప్పుడు మళ్లీ పవన్ సామాజిక వర్గం కోసం టీడీపీ పడుతున్న పాట్లు ఆ పార్టీకి ఇబ్బంది కానుందని పార్టీలోని కొందరు భావిస్తున్నారు. మెగా హీరో పవన్ తో కాపు ఓట్లు పడతాయని టీడీపీ అంచనా. అందుకే ఆయన సినిమాకు అండగా నిలుస్తూ ఏపీ రాజకీయాన్ని కులాల చుట్టూ తిప్పుతోంది. అటు అధికార పక్షం చిరంజీవిని ఆకాశానికి ఎత్తుతోంది. ఇటు ప్రతిపక్షమ్ పవన్ కోసం వెంపర్లాతోంది. రాజకీయ పార్టీల గేమ్ ను మెగా హీరోలు క్రేజ్ పెంచుకునే దిశగా మలుచుకుంటున్నారా? లేక పాలిటిక్స్ లో వాళ్లు నలిగిపోతున్నారా? అనేది మీరే తేల్చాలి.