Site icon HashtagU Telugu

Chiranjeevi PrajaRajyam : 2024 నాటికి ప్ర‌జారాజ్యం 2.0

Pawan Chiru Ramcharan Allu Arjun

Pawan Chiru Ramcharan Allu Arjun

రాజ్యాధికారం దిశ‌గా `మెగా` ఫ్యామిలీ అడుగులు వేస్తోంది. ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన త‌రువాత ఆ కుటుంబం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటుంద‌ని భావించారు. కానీ, ప్ర‌జారాజ్యం 2.0 రూపంలో 2014 ఎన్నిక‌ల‌కు ముందుగా జ‌న‌సేన అవ‌త‌రించింది. యువరాజ్యం అధ్య‌క్షుడు జ‌న‌సేన చీఫ్ అయ్యారు. ఆయ‌నొక్క‌డే 2019 వ‌ర‌కు పార్టీని న‌డిపారు. 2019 ఎన్నిక‌ల్లో నాగ‌బాబు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఇక 2024 ఎన్నిక‌ల నాటికి `మెగా` హీరోలు సంయుక్తంగా రాజ‌కీయ వేదిక‌పై క‌నిపించే అవ‌కాశాలు లేకపోలేదు. అందుకు బ‌లం చేకూరేలా ఫ్యాన్స్ అత్యంత కీల‌క భేటీని ఇటీవ‌ల విజ‌య‌వాడ కేంద్రంగా నిర్వ‌హించింది.

ఇటీవ‌ల `మెగా` కుంటుబం మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, అల్లు అర‌వింద్ పూర్తిగా కొణిదెల కుటుంబాన్ని దూరంగా పెట్టారని కూడా టాలీవుడ్ లో టాక్ ఉంది. అందుకే, ఆహా ప్రోగ్రామ్ కు బాల‌క్రిష్ణ‌ను ఎంపిక చేసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అల్లు, కొణ‌దెల కుటుంబాల మ‌ధ్య వాణిజ్య‌, వ్యాపారప‌ర‌మైన సంబంధాలు బ‌లంగా ఉన్నాయ‌ని ఆలస్యంగా టాలీవుడ్ గ్ర‌హించింద‌ట. అంతేకాదు, రాజ‌కీయంగా కూడా ఎప్ప‌టిక‌ప్పుడు వాళ్ల మ‌ధ్య గ్యాప్ లేకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని వినికిడి. సినిమా టిక్కెట్ల అంశాన్ని ప‌వ‌న్ లేవ‌నెత్తిన వేదిక రిప‌బ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌. ఆ సినిమా మెగా కుటుంబానికి చెందిన హీరోదే. ఆ త‌రువాత నుంచి జ‌గ‌న్ స‌ర్కార్ కు, టాలీవుడ్ కు మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జరిగింది. టాలీవుడ్ లోని ప‌లువురు ఆ వివాదంపై స్పందించారు. సీఎంను క‌ల‌వ‌డానికి కొంద‌రు హీరోలు, ప్రొడ్యూస‌ర్లు వెళ్లారు. కానీ, అల్లు కుటుంబం ఎక్క‌డా ఆ ఎపిసోడ్ లో క‌నిపించ‌లేదు. ఎలాంటి మాట‌లు వినిపించ‌లేదు. నైస్ గా వివాద‌ర‌హితునిగా, టాలీవుడ్ పెద్ద‌గా చిరంజీవికి ముద్రేప‌డేలా తెర‌వెనుక టాప్ గేమ్ న‌డిచింద‌ని ప్ర‌చారం ఉంది. ఇదంతా అల్లు, కొణిదెల ఫ్యామిలీ ఐక్యంగా ఆడిన గేమ్ గా టాలీవుడ్ లోని ఒక వ‌ర్గం భావిస్తోంది. ఇదే ఐక‌మ‌త్యం 2024 ఎన్నిక‌ల్లోనూ చూస్తామ‌ని చెబుతున్నారు.

అల్లు, కొణిదెల ఐక్య‌త‌ను చాటేలా అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు స్వామినాయుడు నిర్వ‌హించిన కీల‌క స‌మావేశం 2024 ఎన్నిక‌ల ఓపెనింగ్ షాట్ గా చెప్పుకోచ్చు. ఆయ‌న‌ అధ్యక్ష‌త‌న విజ‌య‌వాడ‌లోని ముర‌ళీ ఫార్ఛ్యూన్ హోట్‌లో కీల‌క భేటీ జ‌రిగింది. ప్ర‌తి జిల్లా నుంచి ప‌రిమిత సంఖ్య‌లో ఆహ్వానం మేర‌కు అభిమానులు హాజ‌రయ్యారు. రాబోవు రోజుల్లో ప్ర‌తి గ్రామాన్ని సంద‌ర్శించి ప‌వ‌న్ సీఎం అవుతార‌ని ప్ర‌చారం చేయ‌డం వాళ్ల ప్ర‌ధాన ఎజెండా. అధికారంలోకి వ‌స్తే ప‌వ‌న్ ప‌రిపాల‌న ఎలా ఉంటుంది? అనేది కూడా గ్రామాల్లోకి వెళ్లి తెలియ‌చేయ‌డం మ‌రో ప్ర‌ధాన అంశం. జ‌న‌సేన సానుభూతిప‌రులను క‌లుపుకుని వెళ్లాలి అనేది ఆ మీటింగ్ లోని ఫోక‌స్ పాయింట్‌.

మ‌రికొన్ని స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌ని స్వామినాయుడు వెల్ల‌డించారు. నాయ‌కులకు, అభిమానుల‌కు మ‌ధ్య ఎటువంటి అంత‌రాలు లేవ‌ని క్లారిటీ ఇచ్చారు. పొత్తులపై అధినేత ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటే దానికి అనుగుణంగా ప‌నిచేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. `మెగా` అభిమానులంద‌రూ క‌లిసిక‌ట్టుగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లుగా ప‌నిచేస్తార‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌జారాజ్యం స‌మ‌యంలో కుటుంబాల‌ను కూడా వ‌దిలి పార్టీ కోసం ప‌నిచేశామ‌ని, అప్పుడు ప్ర‌జారాజ్యంపై ఇత‌ర పార్టీలు అనేక కుట్ర‌లు చేసిన విష‌యాన్ని గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం.జ‌న‌సేన‌పై అస‌త్యాలు ప్ర‌చారం చేయ‌డంతోపాటు పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌జ‌ల్లో ప‌ల‌చ‌న చేయ‌డాన్ని ఇక నుంచి అల్లు, కొణిదెల కుటుంబాల హీరోల ఫ్యాన్స్ ఫేస్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.ప‌వ‌న్‌క‌ల్యాణ్, చిరంజీవికి, అల్లు అర్జున్‌కు, రామ్‌చ‌ర‌ణ్ అభిమానులంద‌రూ ఒక‌టేన‌ని స‌మావేశం తీర్మానించింది. అంద‌రి అభిమానులు ఒక‌టే కావ‌డంతో వీరంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసే బాధ్య‌త‌, రాబోయే ఎన్నిక‌ల కోసం ప‌నిచేయించాల్సిన అవ‌సరాన్ని స్వామినాయుడికి అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. మొత్తం మీద 2024 ఎన్నిక‌ల‌కు అల్లు, మెగా హీరోలు 2009 త‌ర‌హాలో ఒకే వేదిక‌పై క‌నిపించ‌బోతున్నార‌న్న‌మాట‌.